telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రాజ్యసభకు .. పౌరసత్వ బిల్లు.. నేడే..నెగ్గించుకునే వ్యూహాలలో బీజేపీ..

parliament india

బీజేపీ ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. సుదీర్ఘంగా చర్చ ..నిరసనలు..వాదోపవాదనలు తరువాత లోక్ సభలో ఎట్టకేలకు కేంద్రం అనుకున్న విధంగా మెజార్టీ సాధించి బిల్లును ఆమోదించటంలో సక్సెస్ అయింది. లోక్ సభలో ఈ బిల్లుకు 311-80 ఓట్ల తేడాతో ఆమోదం లభంచింది. కానీ, ఈ రోజు ఇదే బిల్లు పెద్దల సభలో ఆమోదించేలా బీజేపీ వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఈ సభలో బిల్లు పాస్ అవ్వటం కోసం నెంబర్ గేమ్ కీలకంగా మారింది. ఈ సమయంలో బీజేపీ ట్రబుల్ షూటర్లు ఏం చేయబోతున్నారు..మధ్నాహం రెండు గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో బిల్లు ప్రవేశ పెట్టనున్నారు. ఆ తరువాత చర్చ..ఈ రోజే ఆమోదం పొందేలా వ్యూహం అమలు చేస్తున్నారు. అయితే, చివరి నిమిషంలో శివసేన..జనతాదళ్ యునైటెడ్ ఏం చేస్తాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.

245 మంది సభ్యులుండే ఎగువసభలో ఐదు ఖాళీలున్నాయి. మిగిలిన 240 మందిలో బిల్లు ఆమోదం పొందాలంటే కావలిసిన కనీస బలం 121. ఎన్‌డీఏకు ఇప్పటికే 116 మంది మద్దతు ఉందని బీజేపీ చెబుతోంది. మరో 14 మంది మద్దతు లభిస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది. బీజేపీకి సొంతంగా 83 మంది బలం ఉంది. దీంతో పాటు అన్నాడీఎంకే (11), జేడీయూ (6), అకాలీదళ్‌ (3)ల మద్దతు ఎటూ ఉంటుంది. వీరే కాక- బీజేడీ (7), వైసీపీ (2), టీడీపీ (2) లాంటి తటస్థ పక్షాలు కూడా తమకు బాసటగా నిలుస్తాయని బీజేపీ అంచనా. రాజ్యసభలో కాంగ్రెస్‌ సొంత బలం 46 కాగా, అందులో ఒకరైన సీనియర్ నేత మోతీలాల్‌ వోరా అనారోగ్య కారణాల వల్ల రాలేని పరిస్థితి లో ఉన్నారు.తృణమూల్‌(13), లెప్ట్‌(6), డీఎంకే(5), ఎస్పీ (9), బీఎస్పీ (4), ఆర్జేడీ (5) మొదలైన ప్రధాన పార్టీలతో పాటు చిన్నా చితకా పార్టీలు మరికొన్ని కూడా విపక్షంతో గొంతుకలపొచ్చు.

అయితే వీరి సంఖ్యకు, బీజేపీ సంఖ్యాబలానికి వ్యత్యాసం కనీసం ఉండొచ్చని రాజకీయ పక్షాలు విశ్లేషిస్తున్నా యి. సభకు తప్పనిసరిగా హాజరుకావాలని కాంగ్రెస్‌ సహా మిగిలిన అన్ని పార్టీలూ విప్‌ జారీ చేశాయి. జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ), పౌరసత్వ సవరణ బిల్లుతో ఈశాన్య రాష్ట్రాల్లోని ముస్లింలలో తీవ్ర అభద్రత నెలకొంటుందని జేడీ(యూ) ఆందోళన వ్యక్తం చేసింది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిశోర్‌ ఈ బిల్లుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముస్లింల పట్ల ఈ బిల్లు వివక్ష చూపుతోందన్నారు. అయినప్పటికీ రాజ్యసభలో ఈ బిల్లుకు మద్దతివ్వాలని జేడీ(యూ) నిర్ణయించింది. కాగా,ఈ బిల్లుపై చర్చకు 6 గంటలు కేటాయించినట్టు తెలుస్తోంది. రాత్రికి ఓటింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది.

Related posts