telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ముగిసిన జోన‌ల్ కౌన్సిల్ స‌మావేశం..

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో తిరుపతి తాజ్‌మహల్‌ హోటల్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షత వహించారు.ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో రాత్రి 7 గంటల వరకు కొనసాగింది.

అంతేకాకుండా ఈ సమావేశానికి తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌, తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ లతో పాటు ఇత రాష్ట్రాల మంత్రులు, అధికారులు హజరయ్యారు. ఆయా రాష్టాల సమస్యలు, విజ్ఞప్తులను అమిత్ షా విన్నారు.

Southern Zonal Council meeting - Sakshi

ఏపీకి సంబంధించి ఏడు కీలక అంశాలను జగన్‌ సమావేశంలో ప్రస్తావించారు. విభజన సమయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, న్యాయం చేసేలా చొరవ చూపాలని ఆయన కేంద్రాన్ని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని పట్టించుకోవడం లేదని, ఆ హామీని నెరవేర్చాలని కోరారు.

రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్ధేశిత సమయంలోగా పరిష్కరించాలని, సమస్యల పరిష్కారానికి ఒక కమిటీ వేయాలని అన్నారు. విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు ఇంకా అమలు కావడం లేదని అన్నారు. సమస్యలన్నీ పరిష్కారం కాకుండానే మిగిలిపోతున్నాయని, దీని వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం చేకూరుతుందని అన్నారు.

జగన్ ప్రస్తావించిన అంశాలపై అమిత్‌ షా కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్ధేశిత సమయంలో పరిష్కారం కావాలని అన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల విభజనకు సంబంధించి నెల రోజుల్లో కార్యాచరణ సిద్ధం చేయాలని అమిత్‌ షా ఆదేశించారు.

 ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలు రాష్ట్రాలకు చెందినవి మాత్రమే కాకుండా ఇవి జాతీయ అంశాలని అన్నారు. ఏపీ సీఎం జగన్‌ చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని అమిత్‌షా హామీ ఇచ్చారు.

 

Related posts