telugu navyamedia
సినిమా వార్తలు

“7” మూవీ మా వ్యూ

7

బ్యానర్ : కిర‌ణ స్టూడియోస్‌, ర‌మేష్ వ‌ర్మ ప్రొడ‌క్ష‌న్
న‌టీన‌టులు: హ‌వీష్‌, రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ తదితరులు
సినిమాటోగ్రఫీ – దర్శకత్వం: నిజార్ షఫీ.
స్టోరీ-స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్: రమేష్ వర్మ
మ్యూజిక్ డైరెక్టర్: చైతన్ భరద్వాజ్
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్

సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీ దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం “7”. ఈ చిత్రంలో హవీష్ హీరోగా నటించగా… ఆరుగురు హీరోయిన్లు నటించారు. ఓ అబ్బాయి, ఆరుగురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథ కావడంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి నెలకొంది. అయితే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ఉంటే వాటికెప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంది. ఈ తరహాలోనే తెరకెక్కిన “7” చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ చేసిందా ? అనేది చూద్దాం.

కథ :
ర‌మ్య‌(నందితా శ్వేత‌) అనే అమ్మాయి తన భ‌ర్త కార్తీక్‌ (హ‌వీష్‌) క‌న‌ప‌డుట లేదంటూ పోలీస్ స్టేష‌న్‌లో కంప్లైంట్ ఇస్తుంది. ఆమె చెప్పేదంతా విన్న పోలీస్ ఆఫీస‌ర్‌ (ర‌హ‌మాన్‌), జెన్ని (అనీషా అంబ్రోస్‌) అనే అమ్మాయి కూడా త‌న భ‌ర్త కార్తీక్ క‌న‌ప‌డ‌టం లేదంటూ కంప్లైంట్ ఇచ్చింద‌ని ర‌మ్య‌కు చెబుతాడు. కార్తీక్ ఇద్ద‌ర‌మ్మాయిల‌ను పెళ్లి చేసుకుని మోసం చేశాడ‌ని చీటింగ్ కేసు న‌మోదు చేస్తారు. అదే సమయంలో చెన్నైలోనూ మరో అమ్మాయి ప్రియ (త్రిధా చౌదరి)ని కార్తీక్‌ పెళ్లి చేసుకుని జంప్ అని తెలుస్తుంది. కార్తీక్‌ను ప‌ట్టుకోవ‌డానికి పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలో రామ‌కృష్ణ అనే ఓ ముస‌లి వ్య‌క్తి వ‌చ్చి పోలీసులు వెతుకుతున్న వ్య‌క్తి కార్తీక్ కాద‌ని, అతను ఎప్పుడో చనిపోయాడని, అత‌ను త‌న స్నేహితుడు కృష్ణ‌మూర్తి అని చెబుతాడు. అదే రోజు రాత్రి రామ‌కృష్ణ‌ను ఎవ‌రో దారుణంగా హ‌త్య చేస్తారు. ఆ హ‌త్య కూడా కార్తీక్ చేశాడని అనుమానిస్తారు పోలీసులు. ఎట్టకేలకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. అయితే అరెస్ట్ అయిన కార్తీక్ త‌న భార్య‌ల‌ని చెబుతూ కంప్లైంట్ ఇచ్చిన వారెవరో తనకు తెలియ‌దని చెప్పి షాకిస్తాడు. అదే స‌మ‌యంలో ప్రియ (త్రిదా చౌద‌రి) కార్తీక్ త‌న భ‌ర్త అంటూ పోలీస్‌క‌స్ట‌డీలో ఉన్న కార్తీక్‌ను కాల్చి చంపాల‌ని చూస్తుంది. అసలేం జ‌రుగుతుందో అక్కడే ఉన్న పోలీసులకు కూడా అర్థం కాదు. అస‌లు కార్తీక్ ఎవ‌రు? ఆ ఆరుగురు అమ్మాయిలు కార్తీక్ ను తమ భర్త అని ఎందుకు చెబుతున్నారు ? స‌ర‌స్వ‌తి, భాను ఎవ‌రు? చివరకు ఏం జరిగింది అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండి తెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
హీరోగా నటించిన హ‌వీష్ న‌ట‌న‌లో ఎలాంటి మార్పు లేదు. తొలి సినిమాకు ఎలా ఉన్నాడో ఇప్ప‌టికీ అలాగే ఉన్నాడు. ల‌వ్, సీరియ‌స్ ఇలా భావం ఏదైనా హావభావాలు మాత్రం ఒకేలా పలికించాడు. ఇక నందితా శ్వేత‌, అనీషా అంబ్రోస్‌, త్రిదా చౌద‌రి, అదితి ఆర్య‌, పూజితా పొన్నాడ‌, రెజీనా పాత్ర‌ల ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించారు. అనీషా అంబ్రోస్ లిప్ లాక్స్ ఆకట్టుకుంటాయి. ఇక సినిమాలో రెజీనా పాత్ర కీల‌కం. రెజీనా ఆ పాత్ర‌కు న్యాయం చేసింది. ర‌హ‌మాన్, సుంక‌ర ల‌క్ష్మి మంచి న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించారు. ధ‌న‌రాజ్‌, ఏడిద శ్రీరామ్‌, జోష్ ర‌వి, వేణు ఇలా అందరూ వారి వారి పాత్రల మేర నటించి మెప్పిస్తారు.

సాంకేతిక వర్గం పనితీరు :
బడ్జెట్ విషయం పక్కన పెడితే ప్రేక్షకులను ఆకట్టుకునేలా సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడం అనేది దర్శకులకు కత్తిమీద సాము వంటిదే. ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో నిజార్ ష‌ఫీ తడబడ్డాడు. ప్రథమార్థంలో కొన్ని స‌న్నివేశాలు సాగ‌దీసిన‌ట్లుగా ఉన్నాయి. నిజార్‌ష‌ఫీ డైరెక్ష‌న్ కంటే సినిమాటోగ్ర‌ఫీ బాగా చేశాడు. చైత‌న్ భ‌రద్వాజ్ సంగీతం, నేప‌థ్య సంగీతం అంత గొప్ప‌గా ఏమీ లేదు.

రేటింగ్ : 2/5

Related posts