పులివెందులలో వైసీపీ పోలీసులు అంటూ ఏబీఎన్ – ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
పులివెందుల పోలీసుల తీరుపై సీఎం సీరియస్ అయ్యారు.మాజీ సీఎం జగన్ రెడ్డి సన్నిహితుడు వైసీపీ నేత దుశ్యంత్ రెడ్డికి సంబంధించి బెంగుళూరు సివిల్ పంచాయతీని పోలీసులు సెటిల్‌మెంట్ చేయడం వివాదాస్పదంగా మారింది.
ఈ క్రమంలో వైసీపీ సెటిల్‌మెంట్ వ్యవహారంపై స్థానిక టీడీపీ నేతలు, పోలీసులపై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
కాగా.. మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన దుశ్యంత్ రెడ్డి కమలాపురం వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. ఆయన తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి.
దుశ్యంత్ తండ్రి ఇటీవల మరణించారు. అయితే తనకు బెంగళూరులో కొందరు బకాయిలు పడ్డారంటూ దుశ్యంత్ తండ్రి డైరీలో రాసుకున్నాడు.
దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా లేవు. అయినప్పటికీ ఆ డబ్బులను ఎలాగైనా వసూలు చేయాలని భావించిన దుశ్యంత్.. పోలీసుల ద్వారా సెటిల్‌మెంట్ చేసుకోవాలని భావించాడు.
అందులో భాగంగా డబ్బుల వసూలుకు పోలీసులను రంగంలోకి దింపాడు. డైరీలో ఉన్న పేర్ల ఆధారంగా పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
దీంతో పోలీసులు హుటాహుటిన బెంగుళూరు వెళ్లి మరీ డబ్బులు ఇవ్వాల్సిన వారందరినీ పులివెందులకు తీసుకువచ్చారు.
అంతటితో ఆగకుండా వారిని బెదిరించి దాదాపు రూ.10 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. తాజాగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
దీంతో జగన్ సన్నిహితుడి కోసం పులివెందుల పోలీసులు సెటిల్‌మెంట్‌కు తెరలేపడం వివాదాస్పదంగా మారింది. పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
వైసీపీ ప్రభుత్వం పోయి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కొందరు పోలీసులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ పోలీసులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.