telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

కేసుల మాఫీకే .. 16 సీట్ల పాట పాడుతున్నాడు కేసీఆర్ : రేవంత్ రెడ్డి

Revanth Reddy challenge on Kondangal election

కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి మరోసారి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకొనేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ 16 సీట్లు కోరుతున్నారని విమర్శించారు. అవసరమైతే జాతీయ పార్టీ స్థాపిస్తామని కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో.. ఎన్నికలు పూర్తయ్యాక పార్టీ స్థాపించడంలో ఉపయోగమేమీ లేదని రేవంత్‌ విమర్శించారు. ఫిరాయించిన వారితో కలిపి 60 నెలలుగా కేసీఆర్‌ వద్దే 15 మంది ఎంపీలున్నారని, అయినా ఏమీ సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు.

సికింద్రాబాద్‌లో తెజస అధ్యక్షుడు కోదండరాంతో రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున అక్కడ తెజస పార్టీ శ్రేణుల మద్దతు కోరినట్లు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలంగా వ్యవహరించిన కోదండరాం వద్ద సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘‘గతంలో యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ ప్రకటించింది. విభజన చట్టంలోనూ రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలను కాంగ్రెస్‌ పొందుపర్చింది. హామీలన్నీ రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలి’’ అని రేవంత్‌ అన్నారు. తెలంగాణలో తెజస రెండు లేదా మూడు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనుందని, మిగతా చోట్ల కాంగ్రెస్‌కు మద్దతిస్తామని కోదండరాం వెల్లడించారు. జిల్లా కమిటీని కూడా సమావేశపర్చి మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డికి మద్దతిచ్చే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని కోదండరాం తెలిపారు.

Related posts