telugu navyamedia
ఆరోగ్యం

గురకను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే

guraka

గురక పెడుతున్నారంటే ప్రశాంతంగా పడుకుంటున్నారనే అపోహ ఉండేది. కానీ అభివృద్ధి చెందిన వైద్య విజ్ఞానం గురకకు సంబంధించి ఎన్నో వాస్తవాలను కళ్ళ ముందు ఉంచుతోంది, గురక వల్ల గుండెకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తుంది. గురక పెట్టడానికి అధిక బరువు లేదా కొండ నాలుక పొడుగ్గా ఉండటం, మెడ అతి సన్నగా ఉండటం లేదా ఏ కారణం చేతనైనా ముక్కు రంధ్రాలు మూసుకుపోయి నప్పుడు శ్వాస పీల్చడం కష్టమై నోటితో శ్వాస పీలుస్తుంటారు . ఈ క్రమంలో గొంతులో ఉండే సాఫ్ట్ పాలెట్ కణజాలం కదలికల వల్ల గురక వస్తుంది. మనం సాధారణంగా కూర్చున్నప్పుడో, నిలుచున్నప్పుడో, లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడో మన నోట్లో ఉండే నాలుక ఫ్లాట్ గా ఉండి కొండ నాలుక నిలువుగా ఉంటుంది. మనం ముక్కు ద్వారా గాలి పీల్చినప్పుడు గాలి ముక్కు రంద్రాల ద్వారా లోపలి వెళ్లి గొంతు ద్వారా ఊపిరి తిత్తుల్లోకి వెళుతుంది. కానీ పడుకున్నప్పుడు, ముఖ్యంగా గురక పెట్టేవారిలో కొండనాలుక గొంతులోని వెనుక భాగాన్ని కప్పేస్తుంది, అందువల్ల ఊపిరి పీల్చడం కష్టమైపోతుంది, కాబట్టి నోటితో గాలి పీల్చడం మొదలుపెడతారు.

గురక పెట్టేవారందరికి ఆరోగ్య సమస్యలు రావు. గురక గురకలా ఉంటె సమస్యేం లేదు, అది ఇబ్బందికరంగా మారినప్పుడే సమస్యలు మొదలవుతాయి. గురకపెట్టే వారిని గమనిస్తే వారు మధ్య, మధ్యలో దగ్గుతుంటారు , నోటితో శ్వాస పీలుస్తూ ఇబ్బంది పడుతుంటారు.గురకను నిర్లక్ష్యం చేస్తే క్రమేణా వ్యాధి ముదిరి గాలి లోపలికి వెళ్ళే ప్రక్రియ పూర్తిగా నిలిచి పోతుంది. ఊపిరితిత్తుల్లోకి చేరాల్సిన ఆక్సిజన్ శాతం తగ్గి శరీరంలోని ముఖ్య అవయవాలకు ఆక్సిజన్ అందక గుండె ఎక్కువ సార్లు కొట్టుకోవడం మొదలుపెడుతుంది.. గురక వ్యాధి వున్నవారికి రక్తపోటు, మదుమేహం లాంటి వ్యాధులు ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి, నిద్రలేమి, శరీరానికి సరిపడా పోషకాలు అందక ఆరోగ్యం క్షీణించి ప్రాణాంతక మయ్యే అవకాశాలు ఉన్నాయి. గురకను ఒక్కసారిగా నివారించడం కష్టమే, కానీ అదుపులో ఉంచుకోవడం సాధ్యమే. బరువు తగ్గడం, ఆల్కహాల్ తగ్గించడం, సిగరెట్లకు దూరంగా ఉండటం మొదటిదైతే, రాత్రి పడుకునేటప్పుడు వెల్లకిలా కాకుండా ఒక వైపుకు తిరిగి పడుకోండి, తద్వారా నోరు తెరుచుకునే అవకాశం తక్కువ కాబట్టి ముక్కు ద్వారా గాలి లోపలికి వెళ్లి గురక తగ్గుతుంది.

Related posts