telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

రాతిరి విరిసే పువ్వు.. చీకటి గదిలో నలిగే నువ్వు

రాతిరి విరిసే పువ్వు
చీకటి గదిలో నలిగే నువ్వు
కనిపించే నీ దేహం ఓ అందమైన శయ్య
అని అందరికీ తెలుసు
కనిపించని నీ మనసు మల్లె కన్నా తెల్లన
అని ఎవరికి తెలుసు
నిండు వెన్నెల అందాలని ముఖానికి అద్ది
మెరుపుల చీరకట్టి అలంకరించుకొని
గుండెలో విషాదాన్ని దాచుకుని
పైకి అద్దె నవ్వులని నటిస్తూ
కోరివచ్చిన పుంగవుడికి విందుగా శరీరాన్ని అప్పగిస్తే
సేదతీరే అతనికది కామసుఖం
ఆమెకది రేపటికి తన బిడ్డ ఆకలి తీరుతుందన్న సంతోషం
అంతే కానీ కాసులన్నీ కూడగట్టి
మిద్దెలు, మెడలు కట్టాలని ఏమాత్రం కాదు.
అయినా ఆమె సమాజానికి ఓ రోత
జరిగే అవమానాలే ఆభరణాలు
పతిత అన్న మాటలే ఓదార్చే బంధువులు..
దేశాన్ని అమ్ముకునే స్వార్థపరులకంటే తన శరీరాన్ని అమ్ముకుని బతికే ఆమె ఎంతో మేలు.
ఒకవేళ ఆ వృత్తి మాని గౌరవంగా బ్రతకాలని
పని కోసం వెళ్తే పక్కలోకి రమ్మని పిలిచేవారే చుట్టూరా…
ఇలాంటి నికృష్ట జాతి నీచ రసికులు ఉన్నంత కాలం
ఆమె ఒళ్ళుని ఇలా కుల్లబెట్టుకోక తప్పదు….
ఇంట్లో పిల్లలు పడుకోకముందే
సంసారాలు చేసే ఈ బుద్ధి హీనులకి
నీతి నియమాలు, నైతిక విలువలు ఉంటాయా….??
ఆమెని గౌరవంగా బతకానిస్తారా…??
ఈ లోకం
అంతా కట్నం అని,
లంచం అని
నిత్యం వ్యభిచారం చేస్తుంటే వాళ్ళని సమాజం నుండి వెలేయకుండా ప్రతివ్రతా వేశ్యవైన నిన్ను వేలేస్తారు ఎందుకో….!!

Related posts