telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మూగబోయిన గొంతు..

నేనండీ మీ పాఠశాలను…

అనునిత్యం ఉపాధ్యాయుల భోదనలతో… 

స్వచ్ఛమైన పిల్లల కిలకిల రాగాల చిరునవ్వులతో మార్మోగే నేను 

స్తబ్దమై మూగబోయి 

నిర్జీవంగా మిగిలానిలా …

 

బడిలో మొదటి గంటతో… 

నా మిత్రులైన బుడతలను చూసి …

నా మది పులకిస్తూ ఉప్పొంగేది…! 

 

ఆఖరి బెల్లు మోతతో… 

వెళ్ళొస్తామంటూ పిల్లలు ఆనందంగా వెళ్తుంటే … 

నా హృది నవ్వుతూ

క్షేమంగా వెళ్ళిరండంటూ సాగనంపేది…! 

 

సెలవులొచ్చినప్పుడు 

నా సోపతి గాళ్లు లేక సొమ్మసిల్లి ఉండేదాన్ని …

మళ్లీ పిల్లల రాకతో రెట్టింపు ఆనందం ఉప్పొంగేది…! 

 

ఈ కరోనా భూతం ఆవహించి 

నా నుండి నా వాళ్లను దూరం చేసింది …

మిత్రుల రాకకై ఎదురుచూస్తూ

గొంతు మూగబోయి  

హృదయం వేదనతో రోధిస్తుంది…!

 

నా ఆప్తులైన టీచర్లు 

జీతాలు లేక పస్తులుంటున్నారని తెలిసి 

హత్తుకుని ఓదార్చాలని

ఆవేదనతో ఆర్తిగా ఎదురుచూసినా 

కరోనా వేళ 

నా దరికి రాలేని దుఃఖంలో 

మునిగారని తెలిసి మౌనంగా రోధిస్తున్నా …!

 

కనికరం లేని కరోనా ఖతం ఎప్పుడో ….

నా గది గోడలకు పూర్వ వైభవం వచ్చేదెప్పుడో …!

 

మూగబోయిన నా గొంతుకు 

మాటల వరాలొచ్చేదెప్పుడో … 

వేయి కళ్లతో వేచిచూస్తూంటా….!

 

మామిడాల శశిరేఖ 

అడ్వకేట్ 

వరంగల్

Related posts