telugu navyamedia
రాజకీయ వార్తలు

పూర్తి బాధ్యతలు తీసుకునేందుకు .. సిద్దమైన ప్రియాంకాగాంధీ ..

sonia and priyanka gandhi in raebareli

ప్రియాంక గాంధీకి ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌, పూర్తి బాధ్యతలు అప్పగించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర తూర్పు ప్రాంత కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌గా మాత్రమే ఉన్న ఆమె త్వరలో యూపీ కాంగ్రెస్‌ బాధ్యతలు తీసుకోనున్నారు. యూపీలో పార్టీకి పునర్‌ వైభవం తీసుకొచ్చే ఉద్దేశంతో భారీ మార్పులు తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. సార్వత్రిక ఎన్నికల ముందు రాహుల్‌ సోదరి ప్రియాంక గాంధీని యూపీ తూర్పు ప్రాంత ఇన్‌ఛార్జ్‌గా నియమించిన సంగతి తెలిసిందే. పశ్చిమ ప్రాంతాన్ని పార్టీ సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియాకు అప్పగించారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మరీ దారుణంగా ఉండటంతో ప్రస్తుత యూపీసీసీ అధ్యక్షుడు రాజ్‌ బబ్బర్‌ స్థానంలో మరొకరిని నియమించాలని అధిష్ఠానం భావించినట్లు ఓ నాయకుడు తెలిపారు. ఈ క్రమంలో ప్రియాంక పేరు తెరపైకి వచ్చిందని చెప్పారు.

యూపీసీసీ కమిటీలోని సభ్యులు గతంలో ఉన్నదానికంటే 10 రెట్లు తక్కువగా నియమిస్తారని చెప్పారు. వారి వయసు కూడా 40 ఏళ్లకు మించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని వెల్లడించారు. గత మూడు నెలలుగా కసరత్తు జరుగుతున్న ఈ నియామక ప్రక్రియ ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల కమిటీలను కాంగ్రెస్‌ రద్దు చేయడం ఇందులో భాగమే. ఇప్పుడు పార్టీ 2022 అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా పని చేస్తోంది. ప్రతి జిల్లాలో ఓ మహిళా నాయకురాల్ని వైస్‌ప్రెసిడెంట్‌గా నియమిస్తున్నాం. వీరిలో దళితులు, ఓబీసీలు అన్ని వర్గాలకు అవకాశం కల్పించి సామాజిక న్యాయం కల్పిస్తున్నాం.. అని ఆయన చెప్పారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్‌ ప్రదేశ్‌లోని 80 లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ కేవలం ఒక సీటు గెలిచిన సంగతి తెలిసిందే. అది కూడా కాంగ్రెస్‌ ఛైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ రాయ్‌ బరేలీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అమేఠీ నుంచి పోటీ చేసిన రాహుల్‌ గాంధీ సైతం, భాజపా నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోవడం గమనార్హం.

Related posts