telugu navyamedia
ఆంధ్ర వార్తలు నరేంద్ర మోదీ రాజకీయ వార్తలు

యోగాంధ్ర విజయంపై సీఎం చంద్రబాబు, లోకేష్‌ను ప్రధానమంత్రి మోదీ ప్రశంసలు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్రపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ప్రశంసల జల్లు కురిపించారు.

ఈరోజు (బుధవారం) జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో యోగాంధ్ర ప్రస్తావనకు వచ్చింది. యోగాంధ్ర విజయవంతంమైందని కేబినెట్‌లో ప్రధాని ప్రశంసించారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు , మంత్రి లోకేష్‌  యోగాంధ్రను విజయవంతం చేశారని తెలిపారు. యోగాంధ్రను విజయవంతం చేసినందుకు చంద్రబాబు, లోకేష్‌లను కేబినెట్ మంత్రుల ముందు మెచ్చుకున్నారు ప్రధాని. యోగాంధ్ర కార్యక్రమం ఊహించని విధంగా జరిగిందన్నారు.

ఇప్పటి వరకూ తాను ఎన్నో కార్యక్రమాలను చూశానని… కానీ యోగాంధ్రలాంటి అతి భారీ కార్యక్రమాన్ని చూడలేదన్నారు.

యోగాంధ్రను ప్రెస్టేజ్‌గా తీసుకుని చంద్రబాబు, లోకేష్ చేయడం నిజంగా అభినందనీయమని కొనియాడారు. ఏపీలో నెల రోజుల పాటు యోగాంధ్రను నిర్వహించడం అన్నది మర్చిపోలేని విషయమన్నారు.

అసలు 30 రోజుల పాటు సమాజంలోని అన్ని వర్గాల వారిని కలిపి యోగాంధ్రను ఎలా చేశారో నివేదిక ఇవ్వాలని ఏపీని కోరినట్లు కేబినెట్ సమావేశంలో మోదీ తెలిపారు.

ఏపీ నుంచి యోగాంధ్రపై నివేదిక వచ్చిన తరువాత దాన్ని అన్ని రాష్ట్రాలకు పంపనున్నట్లు చెప్పారు. ఒక మంచి కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలో చంద్రబాబు, లోకేష్‌ను చూసి మిగతా వారంతా నేర్చుకోవాలని సూచించారు.

యోగాంధ్ర విజయాన్ని అందరూ స్టడీ చేయాలని కేంద్ర మంత్రులకు తెలియజేశారు. యోగాంధ్రకు రెండు గిన్నీస్ రికార్డులతో పాటు పలు రికార్డులు రావడం కూడా సంతోషంగా ఉందని కేబినెట్ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు.

Related posts