భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్వల్ప గుండెపోటుతో శనివారం కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ఆస్పత్రిలో చేరగా ఆయనకు యాంజియోప్లాస్టీ చేశారు. గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉంది. దాదా మెరుగ్గా ఉన్నారని, బీపీ, ఆక్సిజన్ స్థాయి సహా ఆరోగ్య పరిస్థితి మొత్తం సాధారణమేనని వుడ్‌ల్యాండ్స్ హాస్పిటల్ డాక్టర్లు వెల్లడించారు. శనివారం స్వల్ప గుండెపోటు రావడంతో గంగూలీ హాస్పిటల్‌లో చేరారు. దాదా గుండె రక్తనాళాలు మూడు చోట్ల మూసుకుపోవడంతో స్టెంట్ ను పంపి వైద్యులు క్లియర్ చేశారు. గంగూలీకి తదుపరి చికిత్సపై తమ వైద్యులు నిర్ణయం తీసుకుంటారని.. పరిస్థితిని బట్టి మళ్లీ యాంజియోప్లాస్టి నిర్వహించాలా అన్న విషయంపై నిర్ణయానికి వస్తారని తెలిపింది హాస్పిటల్ యాజమాన్యం. సౌరవ్ గంగూలీతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఫోన్‌లో మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే తాజా సమాచారం ప్రకారం దాదా జనవరి 6 న డిశ్చార్జ్ కానున్నారని తెలుస్తుంది. గంగూలీ హయాంలో భారత జట్టు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందుకుంది. గంగూలీ 113 టెస్ట్, 311 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడారు. వన్డేల్లో 11,363 పరుగులు చేశారు. ఇందులో 22 సెంచరీలు, 72 అర్ద సెంచరీలు ఉన్నాయి. ఇక టెస్ట్‌ల్లో 7,212 రన్స్ సాధించారు గంగూలీ.
previous post