వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన మెమోపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి గురువారం విచారణ చేపట్టారు.
దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ జగన్ తరఫు న్యాయవాదిని ఆదేశించారు. అనంతరం ఈ కేసును అక్టోబర్ 22వ తేదీకి వాయిదా వేశారు.
అక్టోబర్ 1 నుంచి 30వ తేదీ మధ్య.. 15 రోజుల పాటు యూరప్ పర్యటనకు వెళ్తున్నాననీ అందుకు అనుమతించాలంటూ సీబీఐ కోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు.
విదేశాలకు వెళ్లే ముందు ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ సహా పర్యటన వివరాలను సమర్పించాలని షరతులు విధిస్తూ సీబీఐ కోర్టు వైఎస్ జగన్ యూరప్ పర్యటనకు అనుమతి మంజూరు చేసింది.
అయితే కోర్టుకు వైఎస్ జగన్ ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆయనది కాదని సీబీఐ పరిశీలనలో వెల్లడి అయింది. ఈ నేపథ్యంలో బెయిల్ షరతులను వైఎస్ జగన్ ఉల్లంఘించిన అంశాన్ని కోర్టు దృష్టికి సీబీఐ అధికారులు తీసుకు వెళ్లారు.
వేరే నెంబర్ కోర్టుకు సమర్పించడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో వైఎస్ జగన్ విదేశీ పర్యటనను రద్దు చేయాలంటూ హైదరాబాద్లోని ప్రధాన కోర్టులో సీబీఐ ఉన్నతాధికారులు మెమో దాఖలు చేశారు.
ఈ మెమోపై గురువారం హైదరాబాద్లోని సీబీఐ ప్రధాన కోర్టులో విచారణ జరిగింది.