మహిళా రిపోర్టర్లపై ఫాక్స్ న్యూస్ వ్యాఖ్యాత జెస్సీ వాటర్స్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళా జర్నలిస్ట్‌లు, న్యూస్ రిపోర్టర్లు వార్తల కోసం పడుకునేందుకు కూడా సిద్ధ పడుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా రిపోర్టర్లు కీలకమైన సమాచారం రాబట్టేందు ఎంతకైనా తెగిస్తారని అన్నాడు. సోర్స్‌తో ఓ రాత్రి గడిపేందుకు మహిళా జర్నలిస్ట్‌లు సిద్ధపడతారని ఫాక్స్ న్యూస్ టాక్ షో ‘ది పైవ్’లో చెప్పుకొచ్చాడు జెస్సీ వాటర్స్. సినిమాలు, టీవీ షోల్లో చూపుతున్నట్టుగానే నిజ జీవితంలో కూడా అటువంటి వ్యక్తులు ఉంటారని, న్యూస్ కోసం ఎటువంటి పనికి అయినా వాళ్లు సిద్ధం అవుతారు అని అన్నారు. తమ సంస్థలో కూడా అలీ వాట్కిన్స్ అనే మహిళా రిపోర్టర్ ఇటువంటి పని చేసి నాలుగేళ్లపాటు పొలిటికల్ వార్తల్ని అందరి కన్నా ముందుగా ఇచ్చేదని వాటర్స్ తెలిపాడు.
అట్లాంటా-జర్నల్ కాన్స్టిట్యూషన్ రిపోర్టర్ కేథీ ష్రగ్స్ జీవితం ఆధారంగా రిచర్డ్ జువెల్ అనే సినిమా రూపొందుతుండగా అందులోని కథాంశం కూడా సరిగ్గా ఇటువంటిదే. రహస్య సమాచారం కోసం కేథీ ష్రగ్స్ వ్యభిచారం చేసింది అనేది సినిమాలోని కథాంశం. వివాదాస్పద కథాంశంతో వార్తల్లో నిలిచిన రిచర్డ్ జువెల్ సినిమా వాటర్స్ వ్యాఖ్యలతో మరోసారి చర్చనీయాంశం అయ్యింది. గతంలో మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వాటర్స్ తీవ్ర విమర్శలు ఎదుర్కోగా.. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. ఇక నిరాధార, నిందారోపణలు చేస్తున్న వాటర్స్ వ్యాఖ్యలు చండాలంగా ఉన్నాయని మండిపడుతున్నారు అమెరికాలోని కొందరు జర్నలిస్ట్‌లు. సొంత సంస్థ మహిళా ఉద్యోగులను అవమాన పరిచిన వాటర్స్ తరపున ఫాక్స్ న్యూస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.