telugu navyamedia
ఆంధ్ర వార్తలు

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు అంద‌రూ ఆహ్వానితులే..-పవన్

జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. కనీవినీ ఎరుగరి రీతిలో అత్యంత ఘనంగా ఈ కర్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు.

జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి సమీపంలోని ఇప్పటం గ్రామంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేశారు. జనసేన పార్టీ స్థాపించి 8 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా నిర్వహించే ఈ సభకు రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందరినీ ఆహ్వానించారు.

ఈ కార్యక్రమానికి జనసైనికులు, వీర మహిళలు, రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించే అందరూ ఆహ్వానితులేనని పవన్ కళ్యాణ్ తెలిపారు. సభలో వీరమహిళలు కూర్చునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.

ఏపీ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని జనసైనికులకు దిశానిర్దేశం చేసేలా ఈ సభ ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. గత వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో ఏమేమి జరిగాయి.. ప్రజలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు.. భవిష్యత్తు ఎలా ఉండబోతోంది తదితర అంశాలపై సభలో వివ‌రిస్తామ‌ని చెప్పారు.

భావితరాలకు ఎలాంటి భరోసా కల్పిస్తే మెరుగైన భవిష్యత్ అందించగలం అనే అంశాలపై జనసేన పార్టీ నుంచి ప్రజల్లోకి ఒక బలమైన సందేశం పంపించేలా ఈ ఆవిర్భావ దినోత్సవ సభ ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

అటు సభకు వచ్చేవారిని ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందని పవన్ ఆరోపించారు. సభకు వెళ్లడం తమ హక్కు అని ప్రతి జనసేన కార్యకర్త చాటిచెప్పాలన్నారు. పోలీసులు కూడా తమకు సహకరించాలని పవన్ విజ్ఞప్తి చేశారు.

గతంలో తమపై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరికీ, సందేహాలు వ్యక్తం చేసినవారికి రేపు సభాముఖంగా సమాధానం చెప్తానన్నారు.

Related posts