telugu navyamedia
క్రైమ్ వార్తలు

చెరువులో పడి తాత, తండ్రి, మనవడు మృతి…

వరంగల్ జిల్లా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నర్సంపేట మండలం చిన్నగురిజాలలో చెరువులో జారిపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరిని కాపాడేందుకు మరొకరు చెరువులో దిగి ముగ్గురు మృతి చెందారు. ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

వివ‌ర్లాలోకి వెళితే..

నర్సంపేట చిన్న గురిజాల గ్రామానికి చెందిన కృష్ణమూర్తి(65) తనకున్న పొలంలో మక్కజొన్న వేశాడు. చేనులో మొక్కజొన్న ఏరేందుకు కృష్ణమూర్తితో పాటు కుమారుడు నాగరాజు(34), మనుమడి దీపక్​ (లక్కీ(12)) కూడా వచ్చారు. చేతికొచ్చిన మొక్కజొన్న పంటను కోసుకుని బస్తాలు నింపిన తర్వాత ముగ్గురు కూడా సమీపంలోని చెరువు గట్టు వద్దకు వెళ్లి కాళ్లు, చేతులు కడుక్కుంటున్నారు.

అయితే ప్రమాదవశాత్తు నాగరాజు జారి చెరువులో మునిగాడు. నాగరాజును కాపాడేందుకు అతడి తండ్రి కృష్ణమూర్తి చెరువులోపలికి వెళ్లాడు. తాత, తండ్రి ఇద్దరూ కనిపించకపోవటంతో ఏం జరిగిందోనన్న భయంతో.. నాగరాజు కుమారుడు లక్కీ కూడా చెరువులో దిగాడు. చెరువులో దిగిన ముగ్గురు మళ్లీ పైకి రాలేదు.ఆ ప్రాంతంలో జేసీబీతో తీసిన గుంటలు ఉండటం వల్ల.. అందులో మునిగి ఊపిరాడక ముగ్గురూ మృతి చెందారు.

ఒకే కుంటుంబానికి చెందిన మూడు తరాల వ్యక్తులు చనిపోవటంతో కుటుంబం తీరని దుఃఖంలో మునిగిపోయింది. బాధిత కుటుంబాన్ని నర్సంపేట ఎమ్యెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పరామర్శించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts