కాంచీపురంలో అత్తి వరదరాజ స్వామి ఆలయం వద్ద మహిళా పోలీస్ దాడి చేయడంతో రాజమండ్రికి చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. కాంచీపురంలో అత్తి వరదరాజ స్వామి దర్శన మహోత్సవం కనులపండువగా సాగుతోంది. స్వామి దర్శనం కోసం రాజమండ్రికి చెందిన శక్తి ఆకాశ్ అనే యువకుడు తల్లి నాగేశ్వరితో కలిసి సోమవారం కాంచీపురం వెళ్లాడు.
వరదరాజ స్వామిని దర్శంచుకున్న తర్వాత శక్తి ఆకాశ్ ఆలయంలో ఉన్న మూలవిరాట్ విగ్రహాన్ని సెల్‌ఫోన్లో ఫొటో తీసే ప్రయత్నం చేశాడు. దీనిని గమనించిన మహిళా పోలీస్ అడ్డుకుని లాఠీతో అతడి తలపై బలంగా కొట్టింది. దీంతో ఆకాశ్ స్పృహ తప్పి పడిపోయాడు. చికిత్స నిమిత్తం అతడిని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు.