ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశం రూపురేఖలు మార్చిన మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు ఒకప్పటి చైనా అధినేత డెంగ్ జియావోపింగ్ లాంటి నాయకుడని సీఎం చంద్రబాబు అభివర్ణించారు.
మంగళవారం ఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయంలో ఆయన పీవీ స్మారకోపన్యాసం చేశారు.
మైనారిటీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ సోషలిస్టులు, కమ్యూనిస్టులు, కార్పొరేట్లు అందరినీ కలుపుకుని పోయి సమర్థ నాయకత్వాన్ని అందించిన పీవీ నిజమైన తెలుగుబిడ్డ అని చెప్పారు.
హిందీ నేర్చుకోవడాన్ని వివాదాస్పదం చేస్తున్న ప్రస్తుత తరుణంలో 17 భాషలు తెలిసిన ఆయన దేశానికి మార్గదర్శకుడని కొనియాడారు.
పీవీ ప్రారంభించిన సంస్కరణలను వాజపేయి కొనసాగించారని, 1995లో సీఎం అయిన తర్వాత తాను రెండో తరం సంస్కరణలను ప్రవేశపెట్టానని గుర్తుచేశారు.
లైసెన్స్ రాజ్‌ను అంతం చేసిన పీవీ సంస్కరణల ప్రభావాన్ని మనం నేడు అనుభవిస్తున్నామని తెలిపారు.
పీవీ దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడని, రాజకీయ పరిపక్వతకు, సమతుల్యతకు ప్రతీక అని అన్నారు.
భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని జీర్ణించుకున్న ఆయన మొత్తం తెలుగుజాతి గర్వించదగ్గ మేధావి అని, ఆయన జీవితం అందరికీ ప్రేరణ దాయకమని పేర్కొన్నారు.
1991లో అసాధారణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న భారత్ బంగారాన్ని కూడా తాకట్టు పెట్టాల్సివచ్చిందని, అలాంటి పరిస్థితుల నుంచి పీవీ దేశాన్ని గట్టెక్కించారు అని అన్నారు.
విదేశీ పెట్టుబడులు ఆహ్వానించారని, ఐటీ విప్లవానికి నాంది పలికారని సీఎం గుర్తు చేశారు.
తెలుగు రాష్ట్రాలకు వీడనున్న ‘చంద్ర’ గ్రహణం: బీజేపీ నేత లక్ష్మణ్