telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా బాధితులకు అండగా నిలుస్తున్న చిరంజీవి

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి మరో మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో తాను ముందుకు వచ్చి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓ ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. దీన్ని యుద్దప్రాతిపదికన పూర్తిచేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో కాలంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుతో 1998లోనే తన సేవలకు శ్రీకారం చుట్టారు. దీనికి కారణం లేకపోలేదు. ఓ రోజు దిన పత్రిక చదువుతున్నప్పుడు ఓ రోగి సకాలంలో రక్తం అందక చనిపోయాడన్న వార్త అది. ఆ వార్త మెగాస్టార్ చిరంజీవిని ఎంతో కదిలించింది. మన వంతు ఇలాంటి కార్యక్రమం ఏదైనా చేస్తే ఇలాంటి మరణాలు సంభవించవు కదా అనిపించింది. వెంటనే తన ఆలోచనను అమలులో పెట్టారు. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఆయన స్తాపించిన బ్లడ్ బ్యాంక్ రోగులకు అవసరమైన రక్తాన్నిఅందజేస్తూ వస్తోంది. ఎంతోమంది ప్రాణాలను కాపాడింది. ఇటీవల కరోనా మరణాలు కూడా మెగాస్టార్ ను కదిలించాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమయానికి ఆక్సిజన్ అందక ఎవరూ మరణించకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఆక్సిజన్ బ్యాంక్ స్థాపన ఆలోచన. తన ఆలోచనకు కుమారుడు రామ్ చరణ్ తోనూ పంచుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంతో ఓ బృహత్తర ప్రణాళికను రూపొందించారు. అలా యుద్దప్రాతిపదికన ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటవుతోంది. వారం రోజుల్లో ఈ బ్యాంక్ తన సేవలను ప్రారంభించబోతోంది. ఆ ఆక్సిజన్ బ్యాంక్ పర్యవేక్షణ బాధ్యత అంతా రామ్ చరణ్ పర్యవేక్షిస్తారు. మెగా అభిమానులను కూడా ఇందులో భాగస్వాముల్ని చేయబోతున్నారు. ఆయా జిల్లాల అభిమాన సంఘాల అధ్యక్షులు అక్కడ వీటి నిర్వహణ బాధ్యత చూస్తారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటవుతోంది. దీని అధికారిక ప్రకటనను ట్విట్టర్ ద్వారా రామ్ చరణ్ విడుదల చేశారు. తెలుగువారందరికీ ఈ ఆక్సిజన్ బ్యాంక్ అందుబాటులో ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా ట్విట్టర్ అకౌంటును కూడా ప్రారంభించారు. ఇప్పుడున్న ఆక్సిజన్ సంక్షోభాన్ని అరికట్టే ఉద్దేశంతోనే దీన్ని ప్రారంభించబోతున్నట్లు వివరించారు.

Related posts