telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ రెండు సినిమాలపై టాలీవుడు చూపు..

తెలుగు సినిమా రంగం సైతం కొత్త ఆశలతో 2021కి స్వాగతం పలుకుతోంది. ఈ సమయంలో అందరి దృష్టి జనవరి 1వ తేదీ జనం ముందుకు రాబోతున్న రెండు సినిమాల మీద బాగా ఉంది. అవే నాని, సుధీర్ బాబు నటించిన ‘వి’; రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రాలు! ఎందుకంటే ఆ మధ్య వరకూ థియేటర్లలో విడుదల అయిన సినిమాలను ఆ తర్వాత మనవాళ్ళు ఓటీటీలలో చూశారు. కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి. కానీ మొదటిసారి ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన ‘వి’, ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాలు థియేటర్లలో జనవరి 1న ప్రదర్శితం కాబోతున్నాయి. ఒకవేళ రేపు ఈ రెండు సినిమాలను ప్రేక్షకులు థియేటర్లలో చూడానికి వస్తే మాత్రం… ఐదారు నెలలుగా ఓటీటీలలో విడుదలైన స్ట్రయిట్, డబ్బింగ్ సినిమాలు దాదాపు యాభై… థియేట్రికల్ రిలీజ్ కోసం క్యూ కట్టడం ఖాయం. మరీ ముఖ్యంగా అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ ఈ రెండు సినిమాలకు లభించే ఫలితాన్ని బట్టి థియేటర్లలో వచ్చే ఆస్కారం ఉంటుంది.
2020 జనవరి 1న ఆరు సినిమాలు విడుదలయ్యాయి. అందులో మూడు స్ట్రయిట్ మూవీస్ కాగా, మూడు డబ్బింగ్ సినిమాలు. రేపు జనవరి 1న కూడా మొత్తం ఆరు సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. పైన చెప్పుకున్న ‘వి’, ‘ఒరేయ్ బుజ్జిగా’తో పాటుగా రకుల్ ప్రీత్ సోదరుడు అమన్ నటించిన ‘తెర వెనుక’, ‘చిత్రం ఎక్స్’ స్ట్రయిట్ మూవీస్. వీటితో పాటే కన్నడ అనువాద చిత్రం ‘కాళిక’, హిందీ డబ్బింగ్ సినిమా ‘షకీలా’ సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.

Related posts