మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. దీంతో పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీ మృతిపై తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ప్రణబ్ ముఖర్జీ ప్రాణాలు కాపాడడానికి వైద్యులు చేసిన కృషి ఫలించకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ అంశంతో ప్రణబ్ కు ఎంతో అనుబంధం ఉందని సీఎం అన్నారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు వేసిన కమిటీకి నాయకత్వం వహించిన ప్రణబ్, చివరికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌లో న్యాయం ఉందని భావించే వారని, తాను కలిసిన ప్రతీ సారి ఎన్నో విలువైన సూచనలు చేసే వారని గుర్తు చేసుకున్నారు సీఎం కేసీఆర్. ఒక నాయకుడికి ఉద్యమాన్ని ప్రారంభించి, విజయతీరాలకు చేర్చే అవకాశం దక్కడం అరుదుగా సంభవిస్తుందని, ఆ ఘనత తనకు (కేసీఆర్ కు) దక్కిందని ప్రణబ్ ముఖర్జీ తనను ప్రత్యేకంగా అభినందించారని కేసీఆర్ చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ రాసిన ‘ద కొయలేషన్ ఇయర్స్’ పుస్తకంలో కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారని, కేసీఆర్‌కు తెలంగాణ అంశమే తప్ప పోర్టు ఫోలియో అక్కరలేదని పేర్కన్నారని గుర్తు చేశారు. దీనిని బట్టి తన జీవితకాలంలో తెలంగాణ అంశాన్ని అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నదిగా గుర్తించినట్లు అర్థమవుతున్నదని కేసీఆర్ అన్నారు. యాదాద్రి దేవాలయన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను అభినందించారని గుర్తుచేసుకున్న కేసీఆర్.. ప్రణబ్ మరణం తీరని లోటని సీఎం బాధను వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తన తరుఫున, తెలంగాణ ప్రజల తరుఫున ప్రణబ్‌కు నివాళి అర్పించారు. ప్రణబ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సీఎం కేసీఆర్.
కాగా ఈ నెల 10వ తేదీన ప్రణబ్.. ఢిల్లీ ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. అంతకుముందు మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ప్రణబ్‌కు ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన అస్వస్థతకు గురవడంతో ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అప్పుడే ప్రణబ్ కు కరోనా సోకినట్టు తెలిసింది. అప్పట్నుంచీ వైద్యులు ప్రణబ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఆస్పత్రిలో చేరిన దగ్గర్నుంచీ ప్రణబ్ ఆరోగ్యం విషమిస్తూ వచ్చింది. ఆ తర్వాత కోమాలోకి, చివరకు డీప్ కోమాలోకి వెళ్లిన ప్రణబ్.. కొన్ని గంటల క్రితమే సెప్టిక్ కోమాలోకి వెళ్లారు. చివరకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని వైద్యులు ప్రకటించారు. ప్రణబ్ కుమార్ ముఖర్జీ భారతదేశానికి 2012 నుండి 2017 వరకు 13వ రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వర్తించాడు. రాష్ట్రపతిగా ఎన్నిక కాకముందు అతను కేంద్ర ఆర్థిక మంత్రిగా 2009 నుండి 2012 వరకు తన సేవలనందించాడు. తన ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో అతను భారత జాతీయ కాంగ్రెస్లో సీనియర్ నాయకునిగా ఉన్నాడు. కేంద్రప్రభుత్వంలో అనేక మంత్రి పదవులను నిర్వహించాడు. పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ వర్గాల్లో ప్రణబ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. మేధావిగా, సంక్షోభ పరిష్కర్తగా ఆయనకెవరూ సాటి రారని రాజకీయ పక్షాలు అంటూంటాయి. మేధావిగా, రాజకీయ దురంధరుడిగా పేరున్న ప్రణబ్.. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం సంక్షోభ పరిష్కర్తగా ఉన్నారు.
కాలం అనుకూలిస్తే ఆ పని కూడా చేస్తా… : ప్రియాంక చోప్రా