ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తే పేదలకు కనీస ఆదాయ భద్రత కల్పించే పథకం తీసుకొస్తామన్న విషయం తెలిసిందే. అయితే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అది అసాధ్యమని తేల్చి చెప్పేశారు. ఇది కూడా ‘గరీభీ హఠావో’ లాంటి నినాదమేనని చెప్పారు. ఈ పథకాన్ని అమలు చేసేంత వెసులుబాటు భారత్ వద్ద లేదని, అది ఎలా అమలు చేస్తారో చెప్పాలని కాంగ్రెస్ను నిలదీశారు.
రాజీవ్ కుమార్.. సామాజిక భద్రతకు ప్రోత్సాహకాలు ఇచ్చేకంటే వారికి ఉపాధి మార్గాలు కల్పించడమే మంచిదని సూచించారు. చైనా వంటి దేశాలు ఈ విషయంలో ముందడుగు వేశాయన్నారు. రాహుల్ కనీస ఆదాయ పథకాన్ని విమర్శించిన రాజీవ్ కుమార్.. ప్రధాని మోదీ ప్రకటించిన ‘పీఎం కిసాన్ నిధి సమ్మాన్ యోజన’ను మాత్రం ప్రశంసించడం విశేషం. రైతుల నెలసరి ఆదాయం మూడు నాలుగు వేల రూపాయల లోపే ఉంటుందని, అటువంటి వారికి నెలకు రూ.500 ఇవ్వడాన్ని తీసిపారేయలేమన్నారు. ఈ మొత్తాన్ని రైతులు ఏదో ఒకదానికి ఉపయోగించుకుంటారని ఆయన పేర్కొన్నారు.