telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జీహెచ్‌ఎంసీ : చెరువులు, నాలాల పైన కేటీఆర్‌ ఫోకస్‌…అధికారులకు కీలక ఆదేశాలు

ktr telangana

జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులు, నాలాల పైన ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సంవత్సరం కురిసిన వర్షాల వలన పెద్ద ఎత్తున హైదరాబాద్ లోని పలు కాలనీలు, హైదరాబాద్ చుట్టూ ఉన్న ఇతర పురపాలక పట్టణాల్లోనూ వరద ప్రభావం విస్తృతంగా కనిపించిన నేపథ్యంలో అందుకు కారణమైన చెరువులు, నాలాల పైన సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈరోజు ఇరిగేషన్, జలమండలి, హెచ్ఎండిఎ రెవెన్యూ యంత్రాంగం మరియు ఇతర శాఖలతో కలిసి నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువులు, నాలాలు అన్నింటిపైనా పూర్తిస్థాయిలో అధ్యయనం జరగాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. చెరువుల యొక్క నీటి మట్టాలతో పాటు వాటి వరద ప్రభావ పరిస్థితులు మరియు చెరువుల గట్టు (bunds) యొక్క బలోపేతం మరియు వాటి యొక్క బలాన్ని (stability) తెలుసుకునే విధంగా ఈ అధ్యయనం జరగాలని సూచించారు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద చెరువులు, నాలాలకు సంబంధించి పలు అధ్యయన నివేదికలు ఉన్నప్పటికీ, వాటికి అదనంగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సాగునీటి శాఖతో కలిసి ఈ అధ్యయనం జరపాలని ఈ మేరకు మంత్రి కేటీఆర్ అధికారులను కోరారు. ప్రస్తుతం నగరంలో ఉన్న చెరువుల చెరువు కట్టల బలోపేతం, అవసరమైతే ఆయా చెరువులకు అవసరమైన ఇతర నిర్మాణాలను చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా సాగునీటి శాఖ అధికారులు తెలియజేశారు.

శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సిన ఈ కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు చెరువులకు సంబంధించి ప్రత్యేక యూనిట్ న ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ విభాగానికి సాగునీటి శాఖ చీఫ్ ఇంజనీర్ ఒకరు నాయకత్వం వహిస్తారని, జీహెచ్ఎంసీ తరపున ప్రత్యేక కమిషనర్ ఒకరు ఉంటారని వారి ఆధ్వర్యంలో వాటర్ బాడీస్ యొక్క సంరక్షణ, అభివృద్ధి, దాని పరిధిలో ఉన్నటువంటి ఆక్రమణల తొలగింపు వంటి కార్యక్రమాలను ఈ విభాగం పర్యవేక్షిస్తుందన్నారు. దీంతోపాటు హైదరాబాద్ లోని వాటర్ బాడీస్ పైన ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఇందులో జలమండలి, హెచ్ఎండిఎ, రెవెన్యూ, సాగునీటి శాఖ మరియు పలు ఇతర శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారని, ఈ టాస్క్ ఫోర్స్ ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకునేలా పని చేస్తుందన్నారు. సాగునీటి శాఖ రిజర్వాయర్లలో వరద ప్రవాహాన్ని నియంత్రించిన తీరుగానే, ఎప్పటికప్పుడు కురిసే వర్షాలు, దానివల్ల వచ్చేటువంటి వరదను అంచనా వేస్తూ ఆయా చెరువుల్లో నీటి నిల్వలను, వాటర్ ఇన్ ఫ్లో,అవుట్ ఫ్లో నియంత్రించేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని ఈ సందర్భంగా ఈ సమావేశంలో నిర్ణయించారు. జీహెచ్ఎంసి కొత్త చట్టాన్ని తీసుకురానున్న నేపథ్యంలో ఆ చట్టంలో వాటర్ బాడీస్ సంరక్షణ కోసం కఠినమైన నిబంధనలను, నియమాలను చేర్చుతామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. చెరువులో అక్రమంగా భవనాలు నిర్మిస్తే, ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వాటిని కూల్చివేసే అధికారం పురపాలక శాఖకు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

Related posts