నేడు (ఆగస్టు 7) జాతీయ చేనేత దినోత్సవం. 2015 ఆగస్టు 7న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత చేనేత లోగోను ఆవిష్కరించడంతో పాటూ ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించారు. భారత స్వాతంత్ర్యోద్యమములో ప్రధాన భూమిక పోషించి.. స్వాతంత్య్ర సమపార్జనకు చేనేత ఒక సాధనంగా నిలిచింది. భారత స్వాతంత్రోద్యమంలో చేనేత అహింసాయుత ఉద్యమానికి నాంది పలికిన చేనేతరంగానికి ఒకరోజు ఉండాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన యర్రమాద వెంకన్న నేత చేనేత దినోత్సవానికి సరైన తేదీ కోసం అధ్యయనం చేశాడు. అలా విదేశి వస్తు బహిష్కరణలో కీలకపాత్ర వహించిన ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా చేయాలని పిలుపునిచ్చాడు. అప్పటి భారత రాష్ట్రపతిప్రతిభా పాటిల్, అప్పటి కేంద్ర జౌళీ శాఖ మంత్రి శ్రీ శంకర్ సింగ్ వాఘేలా, ఎల్.కె.అద్వానీ లతోపాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు వెంకన్న ప్రయత్నాన్ని అభినందిస్తూ సందేశాలు పంపారు. 2008 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా జరుపుతుంది.
2008, ఆగస్టు 7న హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన చేనేత దినోత్సవ వేడుకలకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. వై.యస్. రాజశేఖరరెడ్డి వచ్చారు. 2012, ఏప్రిల్ 6న రవీంద్రభారతిలో వెంకన్న సారధ్యంలో చేనేత దినోత్సవ చరిత్ర, ఆవశ్యకతను వివరిస్తూ స్వదేశీయం సంగీత నృత్య రూపకం ప్రదర్శించారు. 2012, ఆగస్టు 7న దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట నుండి రాజ్ ఘాట్ వరకు చేనేత వాక్ చేసి జాతీయ స్థాయిలో ఈ దినోత్సవంపై ఆసక్తిని కలిగించాడు. 2014లో అదే రాజ్ ఘాట్ లో చేనేత దినోత్సవ ర్యాలీకి ముఖ్య అతిథిగా వచ్చిన అప్పటి కేంద్ర జౌళీ శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రధానితో చర్చించి చేనేత దినోత్సవాన్ని అధికారికం చేస్తామని మాటిచ్చాడు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర ప్రాంత ప్రభుత్వాల అంగీకారంతో 2015, జూలై 29న భారత ప్రభుత్వం ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా అధికారిక గెజిట్ విడుదల చేసింది.2015,ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ చెన్నైలో అధికారికంగా ప్రారంభించారు. చేనేతరంగంలో విశిష్ట కృషిచేసిన చేనేత కార్మికులను గౌరవిస్తూ 2012నుంచి ప్రతి సంవత్సరం చేనేత కార్మికులకు సంత్‌కబీర్ అవార్డులను జాతీయస్థాయిలో అందిస్తున్నారు.

