జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణస్వీకారం చేసి రికార్డు సృష్టించారు.
పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలువురు జాతీయ నేతలు హాజరయ్యారు.
నితీశ్ కుమార్‌తో పాటు 27 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు.
ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను, నితీశ్ కుమార్ నేతృత్వంలోని కూటమి ఏకంగా 202 సీట్లను కైవసం చేసుకుంది.
ఇందులో బీజేపీ 89 స్థానాల్లో గెలుపొందగా, జేడీయూ 85 స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఏర్పాటైన కొత్త మంత్రివర్గంలో బీజేపీ నుంచి 14 మందికి, జేడీయూ నుంచి 9 మందికి చోటు దక్కింది.
నితీశ్ కుమార్ దాదాపు 19 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. 2000 సంవత్సరంలో తొలిసారి సీఎంగా ఏడు రోజులు మాత్రమే పనిచేసిన ఆయన, ఇప్పుడు పదోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా నితీశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. “రాజకీయాల్లో ఎంతో అనుభవం, రాష్ట్రానికి మంచి పాలన అందించిన అద్భుతమైన రికార్డు నితీశ్‌కు ఉంది” అని ఆయన కొనియాడారు.


పవన్ కు విజన్ లేదు ప్యాకేజ్ ఇస్తే చాలు: మంత్రి వెల్లంపల్లి