రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబుతో కలిసి రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ చేసిన సింగపూర్ పర్యటన విజయవంతమైంది.
నాలుగురోజుల పర్యటన ముగించుకొని గురువారం ఉదయం రాష్ట్రానికి బయలుదేరిన మంత్రి లోకేశ్‌కు అక్కడి తెలుగు ప్రవాస భారతీయులు ఆత్మీయ వీడ్కోలు పలికారు.
గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలకు ఎదురైన చేదు అనుభవాన్ని చెరిపేసి వారిలో నమ్మకాన్ని నింపేందుకు మంత్రి చేసిన ప్రయత్నం సఫలీకృతమైంది.
కనీవినీ ఎరుగనిరీతిలో సింగపూర్ ప్రభుత్వ పెద్దలు, పారిశ్రామికవేత్తల నుంచి లభించిన స్పందన ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను ఇనుమడింపజేసింది.
నాలుగురోజుల పర్యటనలో సీఎంతో కొన్ని, విడిగా మరికొన్ని కార్యక్రమాల్లో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు.
పారిశ్రామికవేత్తలతో వన్ టు వన్ చర్చలు 19, జీ టు జీ (గవర్నమెంటు టు గవర్నమెంట్) సమావేశాలు 6, 4 రౌండ్ టేబుల్ సమావేశాలు, 4 సైట్ విజిట్లు, రోడ్ షో/డయాస్పోరా ఈవెంట్స్ 2 కలిపి మొత్తం 35 కార్యక్రమాలకు లోకేశ్ హాజరయ్యారు.
ఈనెల 27వ తేదీన తొలిరోజు ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యాన నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేశ్ చేసిన ప్రసంగం సింగపూర్ ఎన్ఆర్ఐలలో స్పూర్తినింపింది.
ఏపీ బ్రాండ్ ను ప్రమోట్ చేయడంలో ఎన్ఆర్ఐలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని లోకేశ్ ఇచ్చిన పిలుపు వారిలో చైతన్యాన్ని రగిల్చింది.
నాలుగు రోజుల పర్యటనలో ఎయిర్ బస్, ఎవర్ వోల్ట్, గూగుల్ క్లౌడ్, మైక్రో సాఫ్ట్, మురాటా ఇంజనీరింగ్, కెరియర్, ఇన్ఫినియన్, ఐవీపీ సెమి, క్యాపిటా ల్యాండ్, ఎబీమ్ కన్సల్టింగ్, డీటీడీఎస్ వంటి గ్లోబల్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి లోకేశ్ ఫలవంతమైన చర్చలు జరిపారు.
ఒకసారి ఎంఓయూపై సంతకం చేశాక అనుమతుల నుంచి కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించే వరకు ఆయా సంస్థల పూర్తి బాధ్యత తమదేనంటూ రెండోరోజు ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరం రోడ్ షోలో మంత్రి ఇచ్చిన భరోసా పరిశ్రమదారులను ఆకర్షించింది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమెరికా, దావోస్ పర్యటనల తర్వాత సింగపూర్‌లో మంత్రి లోకేశ్ చేసిన పెట్టుబడుల యాత్ర విజయవంతమై పారిశ్రామికవేత్తల్లో విశ్వాసాన్ని నింపింది.