telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ప్రజలను తప్పుద్రోవ పట్టించడమే.. మోడీ సాదించినదంతా.. : మన్మోహన్ సింగ్

manmohan singh comments on modi govt

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని యువత, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. గత ఆరేళ్ల మోదీ పాలనలో ప్రజలను తప్పుదోవ పట్టించడం ఒక్కటే చేశారని ఎద్దేవా చేశారు. శనివారం దిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన ‘భారత్‌ బచావో’ ర్యాలీలో మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో యువతకు ఉపాధి, రైతుల ఆదాయం రెట్టింపు చేయడం ద్వారా జీడీపీని మెరుగుపరుస్తామని మోదీ హామీ ఇచ్చారు. కానీ అవేవీ నెరవేర్చలేదు. 2024 నాటికి 5ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. ఏటా 2కోట్ల మంది ఉపాధి కల్పిస్తామన్నారు. కానీ ఆ హామీలన్నీ నీటిమూటలేనని రుజువైంది. ఈ ఆరేళ్ల కాలంలో మోదీ చేసిన పని ప్రజలను తప్పుదోవ పట్టించడమొక్కటే అని ధ్వజమెత్తారు. ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని మరింతగా బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

ఈ ర్యాలీలో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంకా గంధీతో పాటు ఇతర సీనియర్‌ నేతలంతా పాల్గొని ప్రసంగించారు. ఆర్థిక మందగమనం, నిరుద్యోగం పెరుగుదల, రైతు సమస్యలపై కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ ర్యాలీకి దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. గత నెల 30న ఈ ర్యాలీ జరగాల్సి ఉన్నప్పటికీ పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఈ నెల 14కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Related posts