telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తాడేపల్లిగూడెం ఆరుగొలనులో ధాన్యంకొనుగోళ్లను అధికారికంగా ప్రారంభించనున్న మంత్రి నాదెండ్ల

ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కానుంది. సోమవారం రోజు నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటికే ప్రకటించారు.

మరోవైపు రైతులు ధాన్యం వివరాల నమోదు కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వాట్సాప్ నంబర్ అందుబాటులోకి తెచ్చింది. 7337359375 నంబరును ఉపయోగించుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు వివరించారు.

ధాన్యం విక్రయాలు జరపాలనుకునే రైతులు ఈ వాట్సాప్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

మరోవైపు ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,013 రైతు సేవా కేంద్రాలు ఉపయోగించుకోనున్నారు.

అలాగే 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ఒకట్రెండు రోజుల్లో వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు. ఈ విషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

ధాన్యం కొనుగోలు తర్వాత 24 నుంచి 48 గంటల్లోపే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ధాన్యం సొమ్ము జమచేస్తామని ప్రకటించారు. మరోవైపు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

తాడేపల్లిగూడెం ఆరుగొలనులో మంత్రి నాదెండ్ల ధాన్యం కొనుగోళ్లను అధికారికంగా ప్రారంభిస్తారు.

మరోవైపు 7337359375 వాట్సాప్ నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేయడం ద్వారా రైతులు తమ ధాన్యం అమ్మకాల ప్రక్రియను చేపట్టవచ్చు.

ఈ నంబర్ ఉపయోగించి ఎప్పుడు, ఎక్కడ, ఎంత మేరకు ధాన్యం విక్రయించనున్నామనే వివరాలను ఎంపిక చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవచ్చు.

ఆ సమయానికి అక్కడకు చేరుకుని రైతులు తమ ధాన్యం అమ్ముకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.అలాగే తమ ధాన్యాన్ని నచ్చిన కేంద్రంలో విక్రయించుకునే వీలుంది.

అలాగే ధాన్యం వాహనంలో ఎగుమతి చేసినప్పటి నుంచి రైసుమిల్లు వద్ద దించే వరకూ జీపీఎస్‌లో ట్రాక్‌ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక ధాన్యం కొనుగోళ్ల కోసం 10 వేల 700 మంది సిబ్బందిని ఉపయోగించనున్నారు.

Related posts