టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ ముత్తయ్య మురళీధరన్. శ్రీలంక స్పిన్ దిగ్గజం మురళీధరన్ 2010 లో గాలె వేదికగా ఇండియాతో తన కెరీర్ చివరి టెస్ట్ మ్యాచ్‌లో ఓజాను ఔట్ చేయడం ద్వారా ఈ మైలురాయి చేరుకున్నాడు. పదేండ్లలో మురళీధరన్ రికార్డుకు చేరువలో ఏ ఒక్క బౌలర్ కూడా చేరుకోలేకపోయాడు. ముత్తయ్య తర్వాత ఆసీస్ లెజండరీ షేన్ వార్న్, భారత స్పిన్నర్ అనిల్ కుంబ్లే రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. అయితే.. తాజాగా అశ్విన్ బౌలింగ్‌పై మురళీ ధరన్ కామెంట్ చేశాడు. ఇప్పుడున్న బౌలర్లలో అశ్విన్‌కు మాత్రమే 800 వికెట్ల మార్క్‌ను చేరుకోవడానికి గొప్ప అవకాశం ఉందని పేర్కొన్నాడు మురళీధరన్. “అశ్విన్ గ్రేట్ బౌలర్. అతినికే ఎక్కువ అవకాశం ఉంది. అంతేకాదు.. మరే యువ బౌలర్ కూడా 800 వికెట్ల మార్క్ వరకు వెళ్తాడని అనుకోవట్లేదు. బహుశా, నాథన్ లైయన్ కూడా ఈ మైలురాయి చేరుకోకపోవచ్చు. ప్రస్తుతం అతడు 400కు దగ్గరగా ఉన్నప్పటికీ ఈ మార్క్ అందుకోవడానికి చాలా ఎక్కువ మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది” అని మురళీధరన్ పేర్కొన్నాడు.

