ముంబయి నుంచి గోవా వెళుతున్న షిప్ రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడారన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకున్న షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు కోర్టు బెయిల్ తిరస్కరించింది. ఆర్యన్ ప్రస్తుతం నార్కోటిక్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఈ నెల 7 వరకు ఆర్యన్ పోలీసుల కస్టడీలోనే ఉండనున్నాడు. ముంబై ఖిలా కోర్టులో డ్రగ్స్ కేసుపై వాడివేడిగా వాదనలు జరిగాయి.
ఆర్యాన్ ఖాన్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు అతడితోపాటు.. అతని స్నేహితులను అక్టోబర్ 11 వరకు కస్టడీకి అనుమతించాలని ఎన్సీబీ తరపు న్యాయవాది కోర్టును కోరారు.. తమకు అందిన సమాచారం ఆధారంగానే రేవ్ పార్టీపై దాడి చేశామని.. అనుమానాస్పద లావాదేవీలపై పట్టుబడిన మరో ఐదుగురు వ్యక్తులు దర్యాప్తులో ఉన్నారని.. అలాగే తాజాగా మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని..ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీ అవసరమని ఎన్సీబీ తరపు న్యాయవాది కోరారు..

దీంతో ముంబైలోని ఎస్ప్లానేడ్ కోర్టు ఆర్యన్ ను కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు అనుమతి ఇచ్చింది. ఆర్యన్ తో పాటు.. అర్బాజ్ సేత్ మర్చంట్, మున్ మున్ ధమేచాలను కూడా ఎన్సీబీ అక్టోబర్ 7 వరకు కస్టడీలో ఉంచనుంది. డ్రగ్స వాడారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్యన్ ఎన్సీబీ కస్టడీలో ఉండాలని జడ్జి ఆదేశించడంతో ఆర్యన్ కన్నీరు పెట్టుకున్నాడు.
ఆర్యన్ ఖాన్ ఫోన్‌లోని మెసేజ్‌ల ఆధారంగా ఆయనను అరెస్టు చేశారని, అందువల్ల ఆయనకు బెయిల్ ఇవ్వాలని ఆర్యన్ లాయర్లు కోర్టులో వాదించినట్లు బీబీసీ మరాఠీ విలేఖరి సుప్రియా సోగ్లే వెల్లడించారు.”ఆర్యన్ స్వయంగా పార్టీకి వెళ్లలేదు. తనను పార్టీకి ఆహ్వానించారు. ఆయన వద్ద టికెట్ కూడా లేదు. ఆర్యన్ బ్యాగ్‌లో ఎన్‌సీబీ అధికారులు డ్రగ్స్‌ను గుర్తించ లేదు” అని ఆర్యన్ లాయర్ మాన్ షిందే అన్నారు.

అయితే, మాదక ద్రవ్యాలను అమ్మేవారితో నిందితుడు ఫోన్ చాటింగ్‌లు చేశారని ఎన్‌సీబీ వాదించింది. నిందితులందరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం ద్వారా వీరంతా మాదక ద్రవ్యాల సరఫరా, వాడకంతో సంబంధాలున్నట్లు తేలిందని అధికారులు తెలిపారు. ముంబై నుంచి గోవా వెళ్తున్న షిప్పులోకి మారు వేషాల్లో వెళ్లిన ఎన్సీబీ పోలీసులు క్రూయిజ్ షిప్పులో డ్రగ్స్ తీసుకుంటున్న వారిని అరెస్ట్ చేశారు. వారిలో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ తో పాటు మరో ఏడుగురు ఉన్నారని పోలీసులు తెలిపారు.
షిప్ ముంబై నుంచి బయల్దేరిన తర్వాత అందరూ కలిసి పార్టీ స్టార్ట్ చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ పార్టీలో 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల చరాస్, 22 ఎండీఎంఏ పిల్స్, 5 గ్రాముల ఎండీని ఎన్సీబీ పోలీసులు తెలిపారు. డ్రగ్స్ కొనడం, దగ్గర ఉంచుకోవడం, నిషేధిత ఉత్ప్రేకరాలను వాడటం వంటి కేసులు ఆర్యన్ పై నమోదు చేశారు.

