*పవన్ కళ్యాణ్ రీల్ హీరో గానీ రియల్ హీరో కాదు..
*ఆయన సీఎం అయ్యేది సినిమాల్లోనే.. రియల్ లైఫ్లో అంత సీన్ లేదు..
*పవన్ పోరాటం ప్రజల కోసం కాదు, పొత్తుల కోసమే..
జనసేన అధినేత పవన్ పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆర్.కే.రోజా సెటైర్లు వేశారు.పవన్ కళ్యాణ్ రీల్ హీరో మాత్రమేనని.. రియల్ హీరో కాదంటూ సెటైర్లు వేశారు.
ఇవాళ తిరుపతిలోని జరిగిన వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ప్రారంభోత్సవానికి మంత్రి రోజా ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా పథకం ప్రారంభోత్సవం చేసి ట్రాక్టరును నడిపి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
![]()
అనంతరం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ..రెండున్నర గంటల సినిమాలో పవన్ కళ్యాణ్.. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్ కూడా కావొచ్చని.. కానీ, రియల్ లైఫ్లో మాత్రం ఆయన సీఎం అస్సలు కాలేరని ఎద్దేవా చేశారు.
అసలు ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి ఓటు బ్యాంకే లేదని రోజా ఎద్దేవా చేశారు. జనసేన పార్టీని ప్రజలు గెలిపించే ప్రసక్తే లేదన్నారు. 175 స్థానాల్లో పోటీ చేయకుండానే పవన్ సీఎం ఎలా అవుతారని ప్రశ్నించారు. పవన్ పోరాటం ప్రజల కోసం కాదని, పొత్తుల కోసమేనని ఎద్దేవా చేశారు.
ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన పవన్ కళ్యాణ్, చంద్రబాబు కు ఏమాత్రం లేదన్నారు. అధికారంలోకి ఏం చేయాలో ప్రజలకు స్పష్టంగా చెబితే ఎవరైనా సీఎం కావొచ్చని ఆమె హితవు పలికారు. వైసీపీని ఎదుర్కోలేక చంద్రబాబు తంటాలు పడుతున్నాడని, ప్రజలంతా జగన్ వెంట ఉండటం చూసి కుట్రలు పన్నుతున్నారని రోజా ఆరోపించారు.
పొత్తులు పెట్టుకున్నంత మాత్రాన వైసీపీని ఎవరు ఏం చేయలేరని, సింగల్ గానే సీఎం జగన్ ఆధ్వర్యంలో ప్రజల్లోకి వెళ్తామని ఆమె తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 160 స్థానాలు మావేనని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు.

