telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వైసీపీ పోవాలి..బీజేపీ రావాలి – జేపీ నడ్డా నినాదం

*ఏపీలో శాంతిభ‌ద్ర‌తలు క్షీణించాయి..
*జ‌గ‌న్ పాల‌న పోయేందుకు స‌మ‌యం ఆస‌న్న‌మైంది..
*ప్రాంతీయ భాష‌కు కృషి చేయాలి కానీ..తెలుగుభాషకు అన్యాయం చేస్తున్నారు
*వైసీపీ పోవాలి..బీజేపీ రావాలి రాజ‌మండ్రిలో న‌డ్డా నినాదాలు..

వైసీపీ పోవాలి – బీజేపీ రావాలని అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజమండ్రిలో జరుగుతున్న బీజేపీ గోదావరి గర్జన బహిరంగ సభలో గ‌ట్టిగా నినాదం చేశారు. ఏపీని వైఎస్ఆర్‌సీపీ నాశనం చేస్తోందని మండిపడ్డారు.

రాజమండ్రి సాంస్కృతిక నగరమని.. ఈ గడ్డ నుంచే తెలుగు భాష ప్రారంభమైందని కానీ మాతృభాషను నిర్వీర్యం చేస్తున్నారని నడ్డా ఆరోపించారు. వ్యాపార వ్యతిరేక రాష్ట్రంగా ఏపీని తయారు చేశారని… అనేక కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయన్నారు.

ఆలయాలపై దాడులు చేస్తున్నారని… శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ప్రతిపక్షాలను అణిచివేసేందుకే జగన్ పనిచేస్తున్నారని… కానీ తమను ఆపలేరని నడ్డా సవాల్ చేశారు.

ఏపీ నుంచి ప్రస్తుత ప్రభుత్వాన్ని సాగనంపాలని, బీజేపీకి అధికారం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జేపీ నడ్డా తెలిపారు

2014కు ముందు కేంద్రంలో అవినీతి ప్రభుత్వం వుండేదన్నారు. మోదీ హయాంలో అవినీతి రహిత పాలనను అందిస్తున్నారని జేపీ నడ్డా అన్నారు. దేశ సంస్కృతిని మోడీ మారుస్తున్నారని నడ్డా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని నడ్డా స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ కవరేజ్ అయిన ఆయుష్మాన్ భవ కార్యక్రమం ద్వారా కోట్లాది మందికి సాయం చేస్తున్నారని… అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా కరోనాను నియంత్రించారని నడ్డా గుర్తుచేశారు.

దేశంలో ఎయిమ్స్ సంఖ్యను మోడీ పెంచారని ఆయన పేర్కొన్నారు. భారత​ నుంచి 500 మిలియన్‌ డాలర్ల ఎగుమతులు జరుగుతున్నాయి. రెండో అతిపెద్ద రిటైల్‌ చైన్‌గా భారత్‌ మారింది. దేశంలో 2.5 కోట్ల గ్రామాలకు ఇంటర్నెట్‌ సేవలు. భారత్‌ అనేక రంగాల్లో ప్రగతి పథంలో వెళ్తోందని నడ్డా తెలిపారు.

 

Related posts