మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఇటీవల ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు ప్రకటించారు. తాజాగా ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు దీనిపై స్పందించారు.
మంచు విష్ణు, తన తండ్రి సీనియర్ నటుడు మోహన్‌బాబు తన ప్యానల్ సభ్యులతోపాటు కలిసి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
దర్శనం తర్వాత విష్ణు మీడియాతో మాట్లాడుతూ .. ‘మా’ ఎన్నికల్లో నా ప్యానెల్ ఎంతో కష్టపడింది.అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అసోసియేషన్ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తాను. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామాలు చేశారని.. మీడియా ద్వారానే తెలిసింది. వాళ్ల రాజీనామా లేఖలు ఇంకా మాకు అందలేదు. రాజీనామా లేఖలు అందాక ఆ విషయంపై స్పందిస్తాను’ అని విష్ణు అన్నారు.
“అందరి కృషితోనే నాకు ఓట్లు పడ్డాయి. ఈ గెలుపు మా ప్యానెల్ సభ్యులందరిది. వారందరికి నా కృతజ్ఞతలు.ఏ పోటీలో అయినా గెలుపోటములు సహజం. ఇప్పుడు మేం గెలిచాం.. మా కృషి, పట్టుదలకు నిదర్శనమే విజయం” అని, మరోసారి వేరేవాళ్లు గెలవచ్చు. ఐ విష్ బెటర్ లక్ నెక్ట్‌టైం’ అని విష్ణు వ్యాఖ్యానించారు.
అనంతరం మోహన్ బాబు.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా తన బిడ్డ ఎంపిక కావడం చాల సంతోషంగా ఉందన్నారు. “నా బిడ్డని…. శ్రీ వేంకటేశ్వరుడు., పరమేశ్వరుడు., షిరిడి సాయి నాథుడు దీవెనలతో పాటు… అసోసియేషన్ సభ్యుల దీవెనలతో ప్రెసిడెంట్ గా గెలుపొందాడు. ఎంతో బాధ్యతతో కూడిన గౌరవ ప్రదమైనది మా అధ్యక్ష పదవి. గౌరవానికి ఎలాంటి భంగం రాకుండా నా బిడ్డ పరిపాలన చేస్తాడు”అని మీడియాకు తెలిపారు.
అక్టోబర్ 10న జరిగిన ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సిని’మా’ బిడ్డలం నుంచి గెలిచిన 11 మంది సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ‘మా’ సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వారు తెలిపిన విషయం తెలిసిందే..