telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ప్రధాన మావోయిస్టు .. సుధాకర్ లొంగుబాటు..

major mavoist sudhakar surrendered

సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్‌, అతని భార్య అరుణ డీజీపీ మహేందర్‌ రెడ్డి ఎదుట లొంగిపోయారు.వారిని డీజీపీ మహేందర్‌ రెడ్డి మీడియా ఎదుట హాజరుపరిచారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. సుధాకర్‌ స్వస్థలం నిర్మల్‌ జిల్లా సంగాపూర్‌ గ్రామ వాసి. సొంత గ్రామంలో ఏడో తరగతి వరకు చదివాడు. 8వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు నిర్మల్‌ గవర్నమెంట్‌ కాలేజీలో చదివాడు. 1983లో జిల్లా రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ సెక్రటరీ కాంటాక్ట్‌లోకి రావడంతో పీపుల్స్‌ వార్‌ ఐడియాలజీకి అట్రాక్ట్‌ అయి అందులో చేరారు. దీంతో ఇంటర్‌ మధ్యలోనే ఆపేశాడు. వివిధ హోదాల్లో పీపుల్స్‌ వార్‌ గ్రూపులో పని చేశారు. బెంగళూరు కేంద్రంగా అన్ని రాష్ర్టాల్లోని పీపుల్స్‌ వార్‌ గ్రూపులకు ఆయుధాలను సరఫరా చేసేవారు. 1986లో సుధాకర్‌ను పోలీసులు అరెస్టు చేసి 11 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 1989లో జైలు నుంచి విడుదలయ్యాక వరవరరావు ఆధ్వర్యంలో నడిచిన రైతు కూలీ సంఘంలో పని చేశారు. జైల్లోనే వరవరరావుతో సుధాకర్‌కు పరిచయం ఏర్పడింది. 1990 నుంచి ఇప్పటి వరకు అండర్‌ గ్రౌండ్‌లో ఉంటూ పని చేశారు.

సీపీఐ మావోయిస్టు గ్రూపుల్లో వివిధ హోదాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వర్తించారు. 1990-92 మధ్య దళం సభ్యుడిగా, 1992-94 వరకు చెన్నూరు దళ కమాండర్‌గా, 1994లో చెన్నూరులో డీసీఎం హోదాలో సుధాకర్‌ పని చేశారు. 1997-99 మధ్య ఆదిలాబాద్‌ జిల్లాకు ఇన్‌చార్జిగా, 1999-2001 వరకు నార్త్‌ జోనల్‌ కమిటీకి ఇన్‌చార్జిగా 2001-03 వరకు దండకారణ్య దళ సభ్యుడిగా, 2003 నుంచి 2013 వరకు మిలిటరీ కమిషన్‌లో సభ్యుడిగా ఉన్నారు. 2013లో సెంట్రల్‌ కమిటీలో సభ్యుడిగా సుధాకర్‌ చేరారు.

ఈఆర్‌బీ సభ్యుడిగా జార్ఖండ్‌, బీహార్‌ ప్రాంతానికి ఇన్‌చార్జిగా పని చేశారు. 2014-19 వరకు ఈఆర్‌బీలో సుధాకర్‌ పని చేశారు. సుధాకర్‌ భార్య అరుణ స్టేట్‌ కమిటీ మెంబర్‌గా పని చేస్తూ సరెండర్‌ అయ్యారని డీజీపీ తెలిపారు. జార్ఖండ్‌, బీహార్‌ కమిటీల్లో ఆమె పని చేశారు. 43 ఏళ్ల అరుణ వరంగల్‌ జిల్లాలోని మహ్మదాపూర్‌ వాసి అని పేర్కొన్నారు. ఎనిమిదో తరగతి వరకు చదివిన అరుణ.. గ్రామంలోకి దళం వచ్చినప్పుడు ఆ పాటలకు ఆకర్షితురాలై వారితో పాటు వెళ్లిపోయింది. 1998లో సుధాకర్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సుధాకర్‌తో పాటు అరుణ ఈఆర్‌బీలో పని చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రివార్డును సుధాకర్‌కు అందజేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.

Related posts