telugu navyamedia
ఆరోగ్యం తెలంగాణ వార్తలు సామాజిక

కుటుంబ సమేతంగా ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలి – నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు కుటుంబ సమేతంగా ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి  తెలిపారు. మంగళవారం మేయర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా నగర మేయర్ డెంగ్యూ నివారణ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… 2023 సంవత్సరానికి భాగస్వామ్య పద్దతులను ఉపయోగించడం ద్వారా డెంగ్యూ వ్యాధిని నిర్మూలిద్దాం అనే థీమ్ నినాదంతో ప్రతి ఇంటింటికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దోమల నివారణకు ఇంటి పరిసరాలలో నీటి నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు. ఇంటి లోపల, ఇంటి పైన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లో దోమ లార్వా నిల్వ ఉండకుండా మూతలు బిగించి ఉండాలని తెలిపారు. ఇంటి పరిసరాలలో రబ్బర్ టైర్లు, డ్రమ్, ప్లాస్టిక్ వస్తువులు, పూల కుండీలలో నీటి నిల్వ లేకుండా శుభ్రం చేసుకోవాలన్నారు.  పాడైపోయిన వస్తువులు, ప్లాస్టిక్, పాలితిన్ వస్తువులలో నీరు నిల్వ లేకుండా, వీటిని దోమలకు ఆవాసయోగ్యం కాకుండా తొలగించాలని తెలిపారు. పిచ్చి మొక్కలు తొలగించి తులసి, పుదీనా, సిట్రోనెల్లా గ్రాస్, లెమన్ గ్రాస్ పెంచడం వల్ల దోమలను నివారించవచ్చని తెలిపారు.

ఇంటి పరిసరాలలో మురుగు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఇంటి నుండి బయటకు వెళ్లే నీరు డ్రైనేజీలోకి, ఇంకుడు గుంతలోకి వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఇంటి పరిసరాలలో నీటిని నిల్వ కు దారితీసే చిన్న చిన్న పూడికలు, గుంతలను పూడ్చివేయాలని తెలిపారు. డెంగ్యూ, చికెన్ గున్య, మలేరియా వ్యాధులను తరిమి కొట్టాలన్నారు. దోమల నివారణకు చెరువు లలో దోమ లార్వాను నివారించేందుకు ఆయిల్ బాల్స్ వేయాలని తెలిపారు. చెరువులలోకి గంబూసియా చేపలు వదలడం దోమలను అరికట్టవచ్చన్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డెంగ్యూ పాజిటివ్ కేసు నమోదు అయినచో స్ప్రేయర్ ద్వారా ఇతరులకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం వార్డు ఆఫీస్ లపై నగర మేయర్ మాట్లాడుతూ… జిహెచ్ఎంసి వార్డు ఆఫీస్ ల ఏర్పాటు ద్వారా సమస్యల సత్వర పరిష్కారానికి దోహదపడతాయని తెలిపారు. వార్డు ఆఫీస్ లో టౌన్ ప్లానింగ్, వాటర్ వర్క్స్, ఎంటమాలజి, శానిటేషన్ తదితర విభాగాల అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రీన్ బంజారా కాలనీ సి.ఎం.టి.సి లో బంజారాహిల్స్ వార్డు కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి డెంగ్యూ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏర్పాటు చేసిన అవగాహన పోస్టర్, కరపత్రాలను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ ఎంటమాలజిస్ట్ డా.రాంబాబు, జూబ్లీహిల్స్ డిప్యూటీ కమిషనర్ రజనీకాంత్, ఖైరతాబాద్ ఎస్.ఇ రజిత, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దోమల నివారణ పద్దతులు

● ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తుంచి వారానికి ఒకసారి నీటి నిలువలను శుభ్రం చేయాలి.
● జీవావరణ విధానంలో గంబూషియా మరియు గప్పి చేపలను మంచి నీటి చెరువులలో, బావులలో, వదిలి దోమ లార్వాలను నియంత్రించవచ్చు.
● రసాయనాల పిచికారి విధానంలో  5ml., టేమీఫాస్ ను 10lit., నీటిలో కలిపి సంపులో, ఓవర్ హెడ్ టాంక్స్ లలో పిచికారి చేయడం వలన లార్వాను నియంత్రించవచ్చు.
● 150gm ల ACM పౌడర్ను 10lit., నీటిలో కలిపి ఇంటి వెలుపల గోడలకు పిచికారి చేయడం వలన పెద్ద దోమలను అరికట్టవచ్చు.
●  1lit.,పైరిట్రిమ్ రసాయనం ను 19lit., కిరోసిన్ లో కలిపి ఇంటి లోపల వుండే గోడల మీద  పిచికారీ చేయడం వలన వ్యాధి కారక ఎడిస్ దోమలను అరికట్టవచ్చు.
● కట్టే పొట్టు ను గోనెపు సంచులలో బంతుల్లాగా (Oil balls) నింపి వాటిని మలేరియా లార్విసైడ్ ఆయిల్ లో నానబెట్టి మురుగు నీరు ఎక్కువుగా ఉన్న ప్రదేశాలు మరియు చెరువులలో వేసి లార్వాలను నియంత్రించవచ్చు.
● డ్రోన్ పరికరాలను ఉపయోగించి చెరువులలో రసాయనాలు పిచికారీ చేసి లార్వాలను నియంత్రించవచ్చు.
● ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్ (FTC) మిషన్ లను ఉపయోగించి చెరువులో ఉండే గుర్రపు డెక్క ను తొలగించడం వలన దోమ లార్వాలను అరికట్టవచ్చు.

Related posts