ఇండియా కరోనా వైరస్‌కి విరుగుడుగా వ్యాక్సిన్ వేసే కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధాని మోడీ 10:30 కి వర్చువల్ విధానంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందనే ఆనందం కొంతమందిలో కనిపిస్తుంటే.. వ్యాక్సిన్ వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటనే ఆందోళన ఇంకొంత మందిలో కనిపిస్తోంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే… కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ముఖ్యంగా స్త్రీలలో కానీ లేదా పురుషులలో సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందనే అపోహ చాలా మందిలో కనిపిస్తోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి సంతానం కలగరనేది కేవలం అపోహేనా లేక నిజమా అనే విషయం తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి హర్షవర్ధన్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ కారణంగా సంతానం కలిగే అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉందనే ప్రచారాన్ని బలపరిచే శాస్త్రీయ ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏవి అయినా.. అవి దీర్ఘకాలం పాటు ఉండవని.. కొద్ది రోజుల్లోనే వాటంతట అవే తగ్గిపోతాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.