స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో గెలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు దిశానిర్దేశం చేశారు.
ఒక్కొక్కరూ ఒక్కో కేసీఆర్‌లా గ్రామాల్లో పని చేయాలని మార్గ నిర్దేశం చేశారు. ఖమ్మం జిల్లాలో ఇవాళ(శుక్రవారం, జులై18) కేటీఆర్ పర్యటించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులకి లోకల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
కొత్త రాష్ట్రం తెలంగాణను నిర్మాణాత్మకంగా, ప్రణాళిక బద్దంగా కేసీఆర్ పదేళ్ల పాలనలో అభివృద్ధి చేశారని ఉద్ఘాటించారు మాజీ మంత్రి కేటీఆర్.
కొత్త ఒక వింత, పాత ఒక రోత అనే చందంగా ప్రజలకు మనపై బోర్ కొట్టిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేతలు మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను వంచించారని మండిపడ్డారు.
రైతు డిక్లరేషన్ , రెండు లక్షల ఉద్యోగాలు, స్కూటీలు, నిరుద్యోగ భృతి, తులం బంగారం వంటి బోగస్ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
చివరకు వృద్ధులు, బలహీన వర్గాలను కూడా కాంగ్రెస్ నేతలు మోసం చేశారని ధ్వజమెత్తారు. ఇప్పటికీ ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే కేసీఆర్ 100 సీట్లలో ఏకపక్షంగా గెలుస్తారని జోస్యం చెప్పారు.
కొన్ని దేశాల్లో రీకాల్ వ్యవస్థ ఉందని గుర్తుచేశారు మాజీ మంత్రి కేటీఆర్.
పాపం అంబేద్కర్.. ఇంత దగుల్బాజీ నాయకులు రాష్ట్రాన్ని పరిపాలిస్తారని ఊహించలేదని విమర్శించారు.
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారని.. ఒకాయన బాంబుల మంత్రి ఆయన బాంబులు పేలటం లేదని ఎద్దేవా చేశారు.
ఆ మంత్రి బాంబులు.. బాంబులంటూ పేలని.. బాంబులు పట్టుకుని తిరుగుతున్నారని దెప్పిపొడిచారు.
మరొక మంత్రి కమీషన్ల చుట్టూ తిరుగుతున్నారని.. ఇంకొక వ్యవసాయ మంత్రి ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావటం లేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరత వచ్చిందని.. కాంగ్రెస్ పుణ్యాన మళ్లీ పాత రోజులు వచ్చాయని రైతులు పాటలు పాడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు గుప్పించారు.