telugu navyamedia
తెలంగాణ వార్తలు

కాంగ్రెస్‌కు బాధ‌తో రాజీనామా చేస్తున్నా..ఏపార్టీలో చేరేది త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తా…

*మునుగోడు ప్ర‌జ‌ల‌కు న్యాయంజ‌రుగుతుంద‌నే రాజీనామా
*పార్టీకి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా రాజ‌గోపాల్ రెడ్డి
*దేశ ప్ర‌జ‌లంతా మోదీ నాయ‌క‌త్వం వైపే చూస్తున్నారు
*కాంగ్రెస్‌కు బాధ‌తో రాజీనామా చేస్తున్నా
*ఈ దేశంలో అరాచ‌కం పోవాలంటే అది బీజేపీతోనే సాధ్యం
*ప్ర‌జ‌లు అర్ధం చేసుకుంటార‌ని భావిస్తున్నా

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు.

మునుగోడు నియోజకవర్గం గురించి.. గత పది పన్నెండు రోజులుగా మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో రాజీనామాపై చర్చ జరుగుతోంది. తానంటే గిట్టనివారు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్‌, టీవీ ఇంటర్వ్యూలలో తప్పుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన రాజీనామాపైనా చర్చ పక్కదారి పట్టిందని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా పోడు భూముల సమస్య వుందని.. అసెంబ్లీ సాక్షిగా ఈ విషయంపై ఎంతోమంది మాట్లాడారని ఆయన గుర్తుచేశారు.

మునుగోడు ప్రజల నిర్ణయం మేరకే నా నిర్ణయం ఉంటుంది. మునుగోడులో అసలు అభివృద్ధి లేదు. ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చలేదు. కనీసం ప్రతిపక్ష ఎమ్మెల్యే హోదాలో కూడా నాకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వట్లేదు.

అటవీ శాఖ అధికారులు పోడు భూముల్లో ఫెన్సింగ్ వేసి గిరిజనులను వ్యవసాయం చేసుకోనివ్వడం లేదని రాజగోపాల్ రెడ్డి ఫైరయ్యారు. గడిచిన మూడేళ్లుగా తన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన అన్నారు. పెన్షన్, రేషన్ కార్డులు, లక్ష రుణమాఫీ, ఇళ్ల నిర్మాణం , నిరుద్యోగ భృతి ఇలా ఏ ఒక్క విషయంలోనూ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడం లేదని రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు.

ప్రతిపక్షనేతలను గౌరవించాలనే ఇంగిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్‌కు.. భట్టి విక్రమార్క సీఎల్పీ నేతగా వుంటే ఒర్వలేకపోయారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు.

ఉప ఎన్నికలు వస్తేనే ఈ ప్రభుత్వం అభివృద్ధి గురించి ఆలోచిస్తోంది.. నిధులు ఇస్తోంద‌ని ఆయన అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ఎమ్మెల్యే పదవి త్యాగం చేసి.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థినే తాను గెలిపిస్తానని టీఆర్‌ఎస్‌కు చెప్పానని, అయినా ఎటువంటి పురోగతి లేదని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకత్వం బలహీనపడడం కూడా తన రాజీనామాకు ఓ కారణమని ఆయన అన్నారు.

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తనను మునుగోడు ప్రజలు ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించారని, కానీ, నియోజకవర్గానికి ఏం చేయలేకపోయానన్న అసంతృప్తి తనలో పేరుకుపోయిందని చెప్పారాయన. రాజీనామా చేస్తేనే ఇక్కడ అభివృద్ధి, కనీస వసతులైనా కలగవచ్చని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ నిజాయితీతో కూడిన రాజకీయాలకు కేరాఫ్‌ అని.. పదవులు, కాంట్రాక్టులు కావాలనుకుంటే టీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన ఆఫర్‌ను తీసుకుని బాగుపడేవాళ్లమని ఆయన అన్నారు.

Related posts