telugu navyamedia
తెలంగాణ వార్తలు

స్వాతంత్ర వజ్రోత్స‌వాల‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌..

*స్వాతంత్ర వజ్రోత్స‌వాల‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
*రాష్ర్ట‌వ్యాప్తంగా 15 రోజులు ఉత్స‌వాలు నిర్వ‌హ‌ణ‌..
*ఈ నెల 22వ‌ర‌కు ఉత్స‌వాలు నిర్వ‌హ‌ణ‌..

తెలంగాణలో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మంగళవారం ఉదయం హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో త్రివర్ణ పతాకం ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం మహాత్మ గాంధీజీ, భరతమాత విగ్రహాలకు పూలమాలలు వేసి వందనం సమర్పించారు. తర్వాత వేదికపై 75 మంది వీణ కళాకారులచే వీణా వాద్య ప్రదర్శన నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం తెలంగాణ ప్రజలను ఉద్దేశించి స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు సంబంధించి కేసీఆర్ ప్రసంగిస్తారు..

తెలంగాణలో స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలను 15 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యసభ ఎంపీ కే కేశవరావు చైర్మన్‌గా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలు, త్యాగాలను స్మరించుకునేలా చిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. ఆగస్టు 22 వరకు వేడుకలు నిర్వహించి నగరంలోని నెక్లెస్ రోడ్‌లో భారీ ర్యాలీని కూడా నిర్వహించనున్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న కార్యక్రమాలతో ఈ వేడుకలు ముగుస్తాయి.

ఈ వేడుకల్లో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్లకు పైగా జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రతి ఇంటిలో జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు. ఇది కాకుండా, “గాంధీ” చిత్రాన్ని రాష్ట్రవ్యాప్తంగా 563 థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఈ చిత్రాన్ని 35 లక్షల మంది విద్యార్థులు వీక్షించనున్నారు. ఈ కార్యక్రమాలతో పాటు.. 15 రోజుల వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలో కవి సమ్మేళనాలు, ర్యాలీలు కూడా నిర్వహించబడతాయి. భారతదేశానికి 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని ఆగస్టు 21న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరగనుంది

Related posts