telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఎస్‌ఐని వెంటాడి పట్టుకున్న ఏసీబీ అధికారులు

సీజ్‌ చేసిన బొగ్గు లారీలను విడిపించేందుకు రూ.2లక్షలు డిమాండ్‌ చేసి సూర్యాపేట జిల్లా కోదాడటౌన్‌ ఎస్‌ఐ కేటీ మల్లేశ్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. లక్షా 90 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శుక్రవారం రాత్రి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.నల్లగొండ ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం…. విజయవాడకు చెందిన డి. వెంకటేశ్వరరావుకు లారీ ట్రాన్స్‌పోర్టు కంపెనీ ఉంది. వీటి ద్వార కొత్తగూడెం నుంచి కర్ణాటకకు బొగ్గు రవాణా చేస్తుంటాడు.  బొగ్గు నాణ్యతపై ఫిర్యాదుతో పోలీసులు కేసు పెట్టి మూడు లారీలను సీజ్‌ చేశారు. దీనిపై సదరు వెంకటేశ్వరరావు కోర్టుకు వెళ్లి లారీల విడుదలకు ఉత్తర్వులు తెచ్చుకున్నారు.
దీనిలో భాగంగా కోర్టు ఉత్తర్వులతో లారీలను విడుదల చేయడానికి పట్టణ ఎస్‌ఐ కేటీ మల్లేశ్‌ను సంప్రదించారు. అయితే లారీల విడుదలకు ఎస్‌ఐ 3లక్షలదాకా లంచం డిమాండ్‌ చేశారు. వెంకటేశ్వరరావు రూ.1.90లక్షలకు ఎస్‌ఐతో ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శుక్రవారం వెంకటేశ్వరరావు, సురేష్  అనే వ్యక్తితో కలిసి డబ్బుతో కోదాడ పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐని కలిశారు. డబ్బుల బ్యాగ్‌ను తన కారులో పెట్టి కూర్చోమని ఎస్‌ఐ చెప్పారు. కారులో నగదు పెట్టగానే ఎస్‌ఐ కారును నడుపుకొంటూ వెళుతుండగా వెనుక నుంచి ఏసీబీ అధికారులు ఎస్‌ఐని వెంటాడి శ్రీరంగాపురం వద్ద పట్టుకున్నారు. డబ్బుతో పాటు కారును సీజ్‌ చేసి కోదాడ డీఎస్పీ కార్యాలయంలో విచారిస్తున్నారు.

Related posts