telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు జరపాలని ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది.

ఈ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలంటూ కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు ఇతర నిందితులందరికీ కోర్టు నోటీసులు జారీ చేసింది.

వారితో పాటు సీబీఐ కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.

గురువారం ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సునీత తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. తన తండ్రి హత్య వెనుక ఇంకా వెలుగులోకి రాని అనేక అంశాలు ఉన్నాయని, వాటిపై సీబీఐ లోతుగా దర్యాప్తు చేయలేదని సునీత తన పిటిషన్‌లో పేర్కొన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

వాస్తవానికి ఈ అంశం బాధితురాలికి, సీబీఐకి మధ్య ఉన్నప్పటికీ, అందరి వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు.

సుప్రీంకోర్టు నిర్దేశించిన సమయాన్ని పరిగణనలోకి తీసుకున్న సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి డాక్టర్ టి.రఘురాం, ఈ నెల 27లోపు కౌంటర్లు దాఖలు చేయాలని నిందితులను, సీబీఐని ఆదేశించారు.

ఈ పిటిషన్‌పై 8 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసిన నేపథ్యంలో కోర్టు విచారణను వేగవంతం చేసింది.

నిందితులుగా ఉన్న గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, దస్తగిరి (అప్రూవర్)లకు కూడా నోటీసులు అందాయి.

ఇదే సమయంలో, వివేకా హత్యకు సంబంధించిన ప్రధాన కేసు విచారణ కూడా గురువారం జరిగింది.

ఈ విచారణకు నిందితులు గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. తదుపరి విచారణను కోర్టు నవంబర్ 10వ తేదీకి వాయిదా వేసింది.

Related posts