భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ అమెరికాతో సత్సంబంధాలు చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయని అన్నారు. ఈ రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు దెబ్బతింటున్నాయా? అనే ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ మేరకు స్పందించారు. భారత్-అమెరికా సంబంధాలను ఆయన 90శాతం నిండిన గ్లాసుతో పోల్చారు. మరో 10శాతం సగమేనని వ్యాఖ్యానించారు. ఆదివారం హూస్టన్‌లో జరిగే ‘హౌడీమోడీ’ కార్యక్రమంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పాల్గొననున్న నేపథ్యంలో జైశంకర్ మీడియాతో మాట్లాడారు. మోడీ, ట్రంప్‌లు వేలాది మంది భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారని తెలిపారు. ఇదొక గొప్ప కార్యక్రమమని అన్నారు. ఆయన పదవి చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన తన అనుభవాలను వివరించారు. భారత్-అమెరికా సంబంధాలు సుదీర్ఘంగా కొనసాగుతాయని, రాజకీయంగా, భద్రతా పరంగా సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. గత 20ఏళ్ల కంటే కూడా ప్రస్తుతం ఇరుదేశాల మధ్య సంబంధాలు బాగున్నాయని అన్నారు. వ్యాపార పరంగా పలు సందర్భాల్లో బేధాప్రాయాలు రావడం సహజమేనని అన్నారు.
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) భారతదేశానికి చెందినదేనని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పునరుద్ఘాటించారు. ఏదో ఒక రోజు పీఓకేపై భౌతిక అధికార పరిధిని సాధిస్తామని, తామే శాసిస్తామని చెప్పారు. జమ్మూకాశ్మీర్ విషయంలో తమకు ఎలాంటి ఆందోళనా లేదని, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ స్థానం ప్రబలంగా ఉందని అన్నారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఉన్న వాతావరణం ఎలా ఉందో చూస్తేనే.. జవాబేంటో తెలిసిపోతోందని జైశంకర్ వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 అనేది తాత్కాలికంగా పెట్టిన నిబంధనేనని అన్నారు. జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితులపై ఈ మేరకు ఆయన స్పందించారు. జమ్మూకాశ్మీర్‌పై ఎవరో ఏమో అంటే ఆందోళన చెందాల్సిన పనిలేదు. 1972 నుంచి భారత్‌ది ఒకే వైఖరి అని చెప్పారు.. అమెరికా కాంగ్రెస్‌తో తనకు చాలా కాలం నుంచి అనుబంధం ఉందని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ పాకిస్థాన్ ఇప్పటికీ తమకు సవాలుగానే ఉందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం పట్ల భారత్ కఠినంగా వ్యవహరిస్తేనే శాంతి నెలకొంటుందని అన్నారు. పాకిస్థాన్ మాటలే చెబుతోంది గానీ.. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని జైశంకర్ మండిపడ్డారు. తాము ఎప్పుడూ ఒకే మాటపై ఉన్నామని, పాకిస్థాన్ మాత్రం తరచూ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌లతో త్వరలో సమావేశం కానున్నారని, ఈ సమావేశంలో పలు అంశాలపై పురోగతి సాధించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. న్యూయార్క్‌లో వచ్చే నెల జరిగే యూఎన్ సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో భేటీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇటీవల రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం. జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేకప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడం, అంతేగాక, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు చేయడాన్ని పాకిస్థాన్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. దీంతో భారతదేశంలో వర్తించే అన్ని చట్టాలు కూడా జమ్మూకాశ్మీర్‌లో అమలవుతాయని ప్రభుత్వం ప్రకటించింది.
హీరోయిన్లపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు