telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జీవిత రాజశేఖర్ కు 20 లక్షలు… వర్మకు కోటి ఇవ్వలేదనే ఇలా… : కేఏ పాల్

KA-Paul

ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్… దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై, నిర్మాత జీవిత రాజశేఖర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను అమెరికాలో బిజీగా ఉంటానని తెలిసినప్పటికీ ‘అమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను తీసి వర్మ తనను రెచ్చగొడుతున్నాడని ఆరోపించారు. వైసీపీకి సపోర్ట్ చేసే జీవితకు తాను రూ.20 లక్షలు ఇచ్చానని షాకింగ్ విషయాలను బయట పెట్టారు. “నేను న్యూయార్క్‌లో ఉన్నాను. అందుకే సోషల్ మీడియా ద్వారా మీడియా వర్గాలకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. బుద్ధిలేని రామ్ గోపాల్ వర్మ నేను ఎంత బిజీగా ఉన్నానో తెలిసి, ఇండియా రాలేనని ఇష్టమొచ్చిన డ్రామాలు ఆడుతూ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఫొటోను మార్ఫ్ చేశాడు. రాష్ట్రపతి అంటే దేశానికి తండ్రి. అలాంటిది ఆయన ఫొటోనే మార్ఫ్ చేసేస్తాడా. సౌదీ అరేబియా వెళ్లి అక్కడి కింగ్‌ని హేళనచేయగలడా? అలా చేస్తే ఉరితీస్తారు. వర్మ నా టైం వేస్ట్ చేస్తున్నాడు. ఇక్కడ మేం ట్రంప్ ఇంపీచ్‌మెంట్ హియరింగ్‌లో బిజీగా ఉన్నాం. నాలా అందరూ 24 గంటలు పనిచేయరు కదా.

మీడియా వర్గాలు ఇంటర్వ్యూలు కావాలని పదే పదే ఫోన్లు చేస్తున్నాయి. అందుకే ఒకేసారి అందరికీ ఓ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. వర్మపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తెలంగాణ పోలీసులు ఎవ్వరినీ వదిలి పెట్టరు. సెన్సార్ బోర్డును, అందులో సభ్యురాలైన జీవిత రాజశేఖర్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాను. అందులోనూ జీవిత రాజశేఖర్ అవినీతిపరురాలు. నాకు రాజశేఖర్ గురించి అంతగా తెలీదు. ఆయన నన్ను రెండు మూడు సార్లు కలిసి చాలా బాగా మాట్లాడారు. కానీ జీవిత అలా కాదు. ఆమె నన్ను రిక్వెస్ట్ చేస్తే రూ.20 లక్షలు ఇచ్చా. మూడు లక్షలు మాత్రమే వెనక్కి ఇచ్చింది. ఆమెపై కేసు నమోదైతే నేనే మాట్లాడి విడిపించా. అవినీతి పరురాలైన జీవిత… వర్మ నుంచి ఎంత తీసుకుంది. డబ్బు తీసుకుందా ? లేదా ? అనేది విచారించాలి. అసలు జీవిత సెన్సార్ బోర్డు రివ్యూ కమిటీలో సభ్యురాలిగా ఉండటమేంటి ? ఆమె వైఎస్సార్ సభ్యురాలు కదా? అలాంటి ఆమెను సెన్సార్ బోర్డులో ఎలా పెట్టారు ? హైకోర్టు సెన్సార్ బోర్డుకు క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చింది. నాపై తీసిన సన్నివేశాలను ఎడిట్ చేసి నాకు నచ్చితేనే సినిమాను విడుదల చేయాలని చెప్పింది. అలాంటిది హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా సెన్సార్ బోర్డు సినిమాను ఓకే చేయడం కరెక్ట్ కాదు కదా. అంటే గౌరవనీయమైన న్యాయస్థానాన్ని కూడా వర్మ పట్టించుకోరా. నా అనుమతి లేకుండా నా సీన్లను వాడుకున్నారు. ఎవడు సహిస్తాడు. అందుకే కోర్టుకు వెళ్లాం. మళ్లీ వెళ్తున్నాం. వర్మ ఎంతమందికైనా డబ్బులు ఇవ్వచ్చు కానీ కోర్టులను, జడ్జిలను కొనలేడు. మాజీ రాష్ట్రపతినే విడిచిపెట్టని ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికీ సపోర్ట్ చేయకూడదు. నా పేరు వాడుకుంటే వివాదాస్పదం అవుతుందని ఏడాది నుంచి నా పేరు వాడుకుంటున్నాడు. వర్మ నా కాళ్ల మీద పడినప్పుడు స్క్రిప్ట్‌కి కోటి రూపాయలు ఇవ్వలేదన్న కక్షతో నాపై ఇలాంటి సినిమా తీశాడు. అవసరం ఉంటే కాళ్లమీద పడటం, డబ్బులు ఇవ్వకపోతే విమర్శలు చేయడం. ఏంటిది? వర్మను త్వరలో పోలీసులు అరెస్ట్ చేస్తారు” అంటూ చెప్పుకొచ్చారు.

Related posts