telugu navyamedia
International రాజకీయ వార్తలు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు: అడియాలా జైలు అధికారులు

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారంటూ సోషల్ మీడియాలో వ్యాపించిన వదంతులపై రావల్పిండిలోని అడియాలా జైలు అధికారులు స్పందించారు.

ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇమ్రాన్ ఖాన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని గురువారం స్పష్టం చేశారు. ఆయన్ను జైలు నుంచి ఎక్కడికీ తరలించలేదని, ప్రస్తుతం తమ వద్దే ఉన్నారని తెలిపారు.

జైలు అధికారులు విడుదల చేసిన ప్రకటనలో, “ఇమ్రాన్ ఖాన్‌ను అడియాలా జైలు నుంచి తరలించారనే కథనాల్లో వాస్తవం లేదు.

ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు, అవసరమైన పూర్తి వైద్య సంరక్షణ అందిస్తున్నాం” అని పేర్కొన్నారు.

ఆయన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను నిరాధారమైనవని కొట్టిపారేశారు.

ఈ వదంతులపై ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని, ఇమ్రాన్‌తో ఆయన కుటుంబ సభ్యుల భేటీని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.

గత కొన్ని వారాలుగా ఇమ్రాన్ సోదరీమణులను ఆయన్ను కలిసేందుకు అనుమతించకపోవడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

తమ సోదరుడిని కలిసేందుకు అనుమతించకపోవడంతో ఇమ్రాన్ సోదరీమణులు అలీమా ఖాన్, నూరీన్ ఖాన్, ఉజ్మా ఖాన్ మంగళవారం అడియాలా జైలు బయట గంటల తరబడి నిరసన చేపట్టారు.

“లోపల ఏం జరుగుతోందో ఎవరికి తెలుసు? బహుశా ఇమ్రాన్‌ను వేరే చోటుకు తరలించి ఉండవచ్చు. అందుకే మమ్మల్ని కలవనివ్వడం లేదు” అని అలీమా ఖాన్ అనుమానం వ్యక్తం చేశారు. దేశంలో అరాచక పాలన నడుస్తోందని ఆమె విమర్శించారు.

Related posts