చట్టానికి ఎవరూ అతీతులు కారని, ప్రజా సొమ్మును ఇష్టారీతిన ఖర్చు చేయడం వల్లే కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరయ్యారని ఎమెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
ఆయన హయాంలో రూ.లక్ష కోట్లు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని, ఈ నేపథ్యంలో కేసీఆర్ విచారణకు హాజరైనందుకు కొందరు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు.
నాంపల్లిలోని టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ జనసమితి గ్రేటర్ హైదరాబాద్ ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోదండరాం పార్టీ జెండా ఎగురవేశారు. ప్రొఫెసర్ జయంశంకర్, అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తప్పు చేస్తే చట్టం ముందు ఎవరైనా నిలబడి సమాధానం చెప్పాల్సిందేనన్నారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం కూలిపోయి, అప్పులు మాత్రం మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కమిషన్ ఎదుట కేసీఆర్ నిజాలు చెబితే బాగుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను వింటుందని, కేసీఆర్ పాలనలో అలాంటి అవకాశమే లేదన్నారు. రానున్న కాలంలో తెలంగాణ జనసమితిని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
నగర అధ్యక్షుడు ఎం.నర్సయ్య అధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్, తెలంగాణ జనసమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్‌రావు,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బైరి రమేశ్, పల్లె వినయ్, నగర ప్రధాన కార్యదర్శి రాంచందర్, కార్మిక విభాగం అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మి, కార్యదర్శి పుష్పలతగౌడ్ తదితరులు పాల్గొన్నారు.