మురుగు నీటి శుద్ధి కేంద్రాల ప్రారంభ సమయం సమీపిస్తున్న వేళ.. జలమండలి ఎండీ దానకిశోర్ వరుస తనిఖీలు చేపడుతున్నారు. గత నెలలో పలుమార్లు వాటిని పరిశీలించిన ఆయన.. ఈ నెలలో కూడా వాటిని కొనసాగిస్తున్నారు. బుధవారం కూడా ఫతే నగర్, ఖాజాకుంట ఎస్టీపీలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్టీపీల నిర్మాణం చివరి దశకు చేరి తుది మెరుగులు దిద్దుకుంటున్నందున అన్ని పనులూ త్వరితగతిన చేపట్టాలన్నారు. యంత్రాల బిగింపు పనుల్లో వేగం పెంచాలని సూచించారు. మిగిలిన అంతర్గత రహదారుల నిర్మాణం, గార్డెనింగ్, పెయింటింగ్ పనులూ పూర్తి చేయాలని ఆదేశించారు. పని ప్రదేశాల్లో కార్మికులందరూ భద్రతా చర్యలు తప్పకుండా పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఈడీ డా.ఎం. సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, ఎస్టీపీ సీజీఎంలు రఘు, పద్మజ, జీఎంలు, ఇతర అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
మురుగు సమస్యకు పరిష్కారం
జీహెచ్ఎంసీ ప్రాంతంలో రోజూ 1650 ఎంఎల్డీల మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. ఇప్పటికే 25 ఎస్టీపీల ద్వారా 772 ఎంఎల్డీల మురుగు నీటిని శుద్ధి చేస్తున్నారు. ఇక మిగిలిన 878 ఎంఎల్డీల మురుగు నీటిని శుభ్రం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,866.41 కోట్ల వ్యయంతో జలమండలి ఆధ్వర్యంలో కొత్తగా 31 నూతన మురుగు నీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నిర్మాణాలు చేపట్టింది. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో ఈ కొత్త ఎస్టీపీల నిర్మాణం జరుగుతోంది.