భారీ వర్షాలకు పశ్చిమ మహారాష్ట్రలోని సంగ్లి, కొల్హాపుర్ జిల్లాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. సహాయ పనుల నిమిత్తం నేవీ, వైమానిక, ఎన్డీఆర్‌ఎఫ్ దళాలను రంగంలోకి దిగించినట్లు అధికారులు తెలిపారు. సుమారు 50వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సంగ్లీలో వరద ముప్పును తగ్గించేందుకు ఆలమట్టి డ్యామ్ నుంచి మరింత నీటిని దిగువకు వదలాలని కర్ణాటక ముఖ్యమంత్రిని కోరినట్లు మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ వెల్లడించారు. గోవాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మండోవి నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. రహదారులపై పలు చోట్ల వాహనాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది.
పనాజీకి సమీపంలోని దివార్ దీవిలో 70 మందికిపైగా నీటిలో చిక్కుకుపోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నొయిడాలో వర్ష సంబంధిత ప్రమాద ఘటనల్లో అయిదుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు చిన్నారులు. దేశ రాజధాని దిల్లీలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలబడిపోవటం వల్ల వాహనాల కదలికలకు ఇబ్బంది ఏర్పడింది. బద్రీనాథ్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న వారి బస్సుపై కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో మంగళవారం ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఒకరు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారని తెలిసింది.
చంద్రబాబు సింపతీ కోసం ప్రయత్నించారు: కృష్ణంరాజు