telugu navyamedia
సినిమా వార్తలు

హీరో సూర్యకు హైకోర్టులో చుక్కెదురు..!

ఆదాయపు పన్ను వడ్డీ మినహాయింపు కోరుతూ సూపర్ స్టార్ సూర్య వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. దాదాపు 3 కోట్లు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ సూర్య వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు జడ్జి ఎస్‌ఎం సుబ్రమణ్యం తోసిపుచ్చింది.

ఇటీవలే అగ్ర నటులు విజయ్, ధనుష్ తమ లగ్జరీ కార్ల కోసం ఎంట్రీ టాక్స్ మినహాయింపు కోరుతూ చేసిన విన్నపాలకు ఇలాంటి సమస్యలోనే చిక్కుకున్నారు. ఈ మూడు కేసుల్లోనూ జడ్జి ఎస్‌ఎం సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

రెండు ఆర్థిక సంవత్సరాలను పరిగణనలోకి తీసుకుని 2010 సంవత్సరంలో టి నగర్‌లోని సూర్య‌ ఇల్లు, బోట్ క్లబ్ ప్రాంతంలోని బంగ్లా, అతని సన్నిహితుల కార్యాలయాలపై దాడులు నిర్వహించి, పైన పేర్కొన్న ఆర్థిక సంవత్సరాలకు 3 కోట్ల 11 లక్షల 96 వేల రూపాయలు చెల్లించాలని ఆదేశించారు.

ఐటీ శాఖ ఈ కేసును మూడేళ్లు ఆలస్యం చేసిందని పేర్కొంటూ మినహాయింపు కోరుతూ సూర్య 2018లో కోర్టును ఆశ్రయించారు. అతను ఎలాంటి డిఫాల్ట్‌లు లేని సాధారణ పన్ను చెల్లింపుదారుడని, ఆయనకు మినహాయింపు కోరే హక్కు ఉందని సూర్య వైపు లాయర్ వాదించారు.

అయితే పన్ను చెల్లింపుల విషయంలో సూర్య సహకరించలేదని ఐటి శాఖ కౌన్సిల్ వాదించింది. కేసును విచారించిన న్యాయమూర్తి ఐటీ శాఖకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. దీంతో సూర్య ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ చెప్పిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

Related posts