telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పొగాకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి అచ్చెన్నాయుడు

రైతులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా దానిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్ధసారధితో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాటలైతే విపరీతంగా చెప్పారు చేతలు మాత్రం శూన్యమని విమర్శించారు. రూ.3 వేల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి పెట్టామన్నారు. ఎంత ఖర్చు చేశారో చూస్తే సున్నా అన్నారు.

ఒక్క పైసా కూడా గత ప్రభుత్వం ఖర్చు చేయలేదన్నారు. అందుకు సంబంధించి ఐదేళ్ళ రికార్డు మా దగ్గర ఉందని మంత్రి చెప్పారు.

వైసీపీ ఐదేళ్ళ పాలనలో రైతుకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు సరి కదా, కనీసం రైతులు, రైతు సంఘాలను కూడా కలవలేదన్నారు. రైతుల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది అన్నారు.

అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే రూ.140 కోట్ల స్థిరీకరణ నిధి పెట్టి ఇప్పటికే రూ. 80 కోట్లు ఖర్చు చేశామన్నారు.

రాష్ట్రంలో నాలుగైదు పంటలకు ధరల్లో ఇబ్బంది వచ్చిందని, ఆయినా ప్రభుత్వం తనకు సంబంధ లేదని ఊరుకోలేదన్నారు. ఆరు నెలల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు దానిపైనే దృష్టిపెట్టారన్నారు.

మిర్చి పంటకి ఇబ్బందులు వస్తే మిర్చి పండిరచిన రైతుల సమస్యను పరిష్కరించేందుకు కేంద్రంతో మాట్లాడి పరిష్కరించామన్నారు.

మళ్లీ ఈ మధ్య కాలంలో ఏలూరు జిల్లాలో కోకో రైతులకు ఇబ్బంది వచ్చిందని, అదే విధంగా ప్రకాశం జిల్లాలో (నల్లబర్లీ) పొగాకు రైతులకు ఇబ్బంది వచ్చిందని, అదే విధంగా మామిడి  రైతులకు ఇబ్బందులు వచ్చాయని, వీటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి కేబినెట్ సబ్ కమిటీ వేశారన్నారు.

వీరు ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఏ పంటలు వేస్తున్నారు ధరలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలను ప్రత్యక్షంగా పరిశీలించి రైతుకు ఎక్కడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.

మరోపక్క నల్ల బర్లీ పొగాకులో చాలా ఇబ్బందులు ఉన్నాయని, ఎగుమతులు ఆగిపోయాయన్నారు. ప్రకాశం జిల్లాలో కూడా రైతులు, కంపెనీలు, పొగాకు బోర్డును కూర్చోబెట్టి సమస్య పరిష్కరిస్తామన్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లబర్లీ పొగాకు మొత్తం కొనాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. వచ్చే ఏడాది నుంచి డిమాండ్ ఆధారంగా పంట వేసే విషయాన్ని ఆలోచించాలని చెప్పారు.

రైతులు ఏ పంటకు ధర వస్తే అదే పంటను ఎక్కువగా వేస్తున్నారని, ఈ సందర్బంలో ధర పతనమైతే నష్టపోతున్నారన్నారు. ధరలు రాలేదని, కౌలు పెరిగిందని రైతులు అధైర్యపడవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని మంత్రి హితవు పలికారు.

ఈ ప్రభుత్వం మీదని, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు తావులేకుండా ప్రభుత్వం ఆన్ని ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. ఇది రైతుల ప్రభుత్వమని, వారికి అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

సమావేశంలో వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్, ఉధ్యానవన శాఖ కమీషనరు కె. శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి), సొంగా రోషన్ కుమార్, తదితరులు ఉన్నారు.

Related posts