మొంథా తుఫాను నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది.
ముఖ్యంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థలో అంతరాయాలు తలెత్తే అవకాశం ఉన్నందున అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో విద్యుత్ శాఖ సిబ్బందికి ఉన్న అన్ని రకాల సెలవులను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
తుఫాను సమయంలో ఏ సమస్య ఎదురైనా వెంటనే స్పందించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.
తుఫాను వేగం, భారీ గాలులు, వర్షపాతం కారణంగా విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, వైర్లు తెగిపోవడం వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువ.
అందువల్ల ఎక్కడైనా విద్యుత్ అంతరాయం తలెత్తిన వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు టీంలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
అత్యవసర సమయాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా విద్యుత్ సరఫరాను శీఘ్రంగా పునరుద్ధరించేందుకు అధిక సంఖ్యలో సిబ్బంది, అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచాలని మంత్రి అన్నారు.
అన్ని సర్కిల్, డివిజన్ స్థాయి అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ప్రజల భద్రత విషయంలో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజానీకాన్నీ అప్రమత్తం చేసింది. ముఖ్యంగా తుఫాను సమయంలో కిందపడిన విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన వైర్లు వంటివాటికి దూరంగా ఉండాలని మంత్రి హెచ్చరించారు.
ఏ ప్రాంతంలోనైనా పవర్ సప్లై సమస్యలు వచ్చిన వెంటనే 1912 హెల్ప్లైన్కు కాల్ చేయాలని సూచించారు.
ప్రభుత్వ సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని, విద్యుత్ శాఖ ప్రజలకు అవసరమైన సేవలను నిరంతరం అందించేందుకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.


అలా చేస్తే వారు నోరు మూస్తారు.. బీజేపీ నేత ముండే సంచలన వ్యాఖ్యలు!