గత ఐదు రోజులలో శిథిలావస్థకు చేరిన 49 భవనాలను కూల్చివేసినట్లు జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదల వలన శిథిలావస్థకు చేరిన భవనాలు ఆకస్మికంగా కూలిపోయే అవకాశం ఉన్నందున, అటువంటి నిర్మాణాలలో ఉంటున్న కుటుంబాలు తక్షణమే ఖాళీ చేయాలని సూచించారు. ప్రత్యామ్నాయం లేనివారికి కమ్యునిటీహాల్స్‌లో తాత్కాలిక వసతి కల్పించనున్నట్లు తెలిపారు. మాన్సూన్ సీజన్లో శిథిలావస్థకు చేరిన భవనాలు, ఇతర నిర్మాణాలకు నోటీసులు జారీచేసినట్లు తెలిపారు. టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు అన్ని సర్కిళ్లలో సర్వే జరిపి భవనాల పటిష్టతపై ఇంజనీరింగ్ విభాగం ద్వారా తనిఖీలు చేయించినట్లు తెలిపారు. నగరంలో మొత్తం 531 భవనాలు శిథిలావస్థలో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
వాటిలో 176 భవనాలను కూల్చివేసినట్లు వివరించారు. అలాగే 109 భవనాలను మరమ్మతులు చేయించడం జరిగినట్లు తెలిపారు. ఇటీవల నగరవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నందున శిథిలభవనాల కూల్చివేతకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా గత ఐదు రోజులలో 49 శిథిల భవనాలను కూల్చివేసినట్లు తెలిపారు. అంతేకాకుండా మరో 15 శిథిల భవనాలలో నివసిస్తున్న 65 మందిని ఖాళీ చేయించినట్లు తెలిపారు. వీరితో పాటు మూసి నది ప్రాంతంలో మంగళహాట్‌లో నివసిస్తున్న 35 మందిని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న శిథిల భవనాలలో నివసిస్తున్న కుటుంబాలను ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించి, అటువంటి భవనాలలో నివసించరాదని నోటీసులు జారీచేసి సీల్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు శిథిల నిర్మాణానికి చుట్టూ భారీకేడింగ్చేసి ఎవరూ లోపలికి వెళ్లరాదని హెచ్చరిక నోటీసు ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 13న కురిసిన భారీ వర్షంతో పలు కాలనీలు వరద ముంపుకు గురై ఇళ్లలోకి నీరు చేరినట్లు తెలిపారు. కొన్ని రోజులపాటు నీరు నిలిచి ఉండడం వలన నిర్మాణ పటిష్టత బలహీనపడుతుందని తెలిపారు. వరద ముంపుకు గురై పటిష్టత దెబ్బతిన్న ఇళ్లలో నివసించరాదని ప్రజలకు సూచించారు. ప్రమాదకర భవనాలు, ఇళ్లను ఖాళీ చేసి జిహెచ్ఎంసి అధికారులకు సహకరించాలని నగర ప్రజలకు కమిషనర్ విజ్ఞప్తి చేశారు.



మూడు పెళ్లిళ్లు అయిన ఒక వ్యక్తితో కడుపు చేయించుకుని… పూనమ్ కౌర్ పై శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు